గోషామహల్‌లో రాజాసింగ్‌పై బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరంటే...
గోషామహల్‌తో పాటు పెండింగ్‌లో ఉంచిన నాంపల్లి స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్.
By Srikanth Gundamalla
గోషామహల్‌లో రాజాసింగ్‌పై బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరంటే...
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ముచ్చటగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి అధికారం చేపట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. అయితే.. కొన్ని అసెంబ్లీ స్థానాలకు బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలినవే ఉన్నాయి. అందులో గోషామహల్ నియోజకవర్గం ఒకటి. ఇందులో 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా బీజేపీ నేత రాజాసింగ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతేకాదు.. 2018 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద బీజేపీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్.
అలాంటి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఈసారి గట్టి అభ్యర్థిని నియమించాలని భావించింది. దాంతో.. ఇప్పటి వరకు అక్కడ అభ్యర్థిని పెండింగ్‌లో ఉంచింది. సరైన నేతను బరిలో పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు ఆలస్యం చేసింది. చివరకు నందకిషోర్ వ్యాస్‌ను ఖరారు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గోషామహల్‌తో పాటు పెండింగ్‌లో ఉంచిన నాంపల్లి స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్. గోషామహల్ నుంచి నందకిషోర్ వ్యాస్, నాంపల్లి నుంచి సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ పోటీ చేయనున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. మంత్రి కేటీఆర్ వీరిద్దరికి బీఫామ్స్ ఇచ్చారు.
ఆగస్టులో 115 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టును ప్రకటించిన బీఆర్ఎస్ జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్ ను పెండింగ్ లో పెట్టింది. ఇటీవల జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డిని.. నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డిని ప్రకటించింది. ఇప్పుడు నాంపల్లి, గోషామహల్ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో మొత్తం 119 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించినట్లు అయ్యింది. కాంగ్రెస్ ఇంకా నాలుగు స్థానాలను పెండింగులో పెట్టింది. బీజేపీ ఇంకా 19 స్థానాలను పెండింగులో పెట్టింది.