ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడిన సంగతి తెలిసిందే. నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) విజయకేతనం ఎగురవేసింది. అయితే.. బీజేపీ విజయంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదన్నారు. ఈవీఎంలు, కేంద్ర బలగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు అందించిన విజయం అని ఎద్దేవా చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు.
నాలుగు రాష్ట్రాల్లో సాధించిన విజయం 2024 లోక్‌సభ ఎన్నికలను ప్రతిబింబిస్తోందని బీజేపీ నాయకులు చెప్పుకోవడాన్ని తోసిపుచ్చారు. బీజేపీ నాయకులు పగటి కలలు కనడం మానేయాలంటూ చురకలు అంటించారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాలని మమతా పిలుపునిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ విశ్వసనీయత కోల్పోతుందని, కాంగ్రెస్‌పై ఆధారపడే పరిస్థితులు లేవన్నారు. చాలా ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఉన్నాయని.. అందరూ కలిసి పనిచేయాలన్నారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని అంటున్నారు కానీ.. జాగ్రత్తగా గమనిస్తే సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఓట్ల శాతం పెరిగిందన్నారు. అఖిలేశ్‌కు సీట్లు పెరుగగా.. బీజేపీకి తగ్గాయన్నారు. యూపీ ఫలితాలతో అఖిలేశ్ యాదవ్ మనోస్థైర్యం కోల్పోరాదన్నారు. తిరిగి ప్రజల్లోకి వెళ్లి, ఈవీఎంలపై ఫోరెన్సిక్ పరీక్షలు జరిపేలా అఖిలేశ్ ఎన్నికల సంఘాన్ని కోరాలని సూచించారు.