కష్టపడుతోన్న రేవంత్‌రెడ్డి బకరా అవ్వడం గ్యారెంటీ: బండి సంజయ్

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పార్టీలో కష్టపడి పనిచేస్తున్నా కూడా.. బకరా అవ్వడం పక్కా అన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్.

By Srikanth Gundamalla  Published on  5 Nov 2023 3:41 PM IST
bjp, telangana, bandi sanjay,  revanth,

కష్టపడుతోన్న రేవంత్‌రెడ్డి బకరా అవ్వడం గ్యారెంటీ: బండి సంజయ్

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పార్టీలో కష్టపడి పనిచేస్తున్నా కూడా.. బకరా అవ్వడం పక్కా అన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. కొందరు రాహుల్‌గాంధీని కలిశారని.. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపునకు కృషి చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. అయితే.. రేవంత్‌రెడ్డిని సీఎం అవ్వకుండా చూస్తామంటేనే తమ మద్దతు ఉంటుందని రాహుల్‌తో వారు చెప్పారన్నారు బండి సంజయ్. దానికి రాహుల్‌గాంధీ కూడా సరే అని చెప్పారని అన్నారు. చివరకు టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో బకరా అవ్వడం గ్యారెంటీ అన్నారు బండి సంజయ్. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ఈ కామెంట్స్ చేశారు.

మరోవైపు బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు బీసీలను చిన్న చూపు చూస్తున్నాయంటూ బండి సంజయ్ మండిపడ్డారు. జనాభాలో అధికశాతం ఉన్న వర్గాన్ని అణిచివేయాలని భావిస్తున్నారంటూ విమర్శించారు. అణగారిన వర్గాల పట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలు తమ వైఖరి మార్చుకోవాలని.. వారికి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే.. బీసీ వర్గమంతా బీజేపీకి అనుకూలంగా ఉందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు అగ్రవర్ణాల్లో పేదలు కూడా బీజేపీకి మద్దతు తెలుపుతున్నారని దీమా వ్యక్తం చేశారు. బీసీలకు బీఆర్ఎస్‌ కేవలం 23, కాంగ్రెస్ 19 సీట్లే కేటాయించాయని విమర్శలు చేశారు బండి సంజయ్. బీసీ నేతలు ఢిల్లీకి వెళ్తే అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా కాంగ్రెస్‌ అధిష్టానం అవమానపర్చిదంటూ చెప్పుకొచ్చారు. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 50 సీట్లు బీసీలకే కేటాయించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని బండి సంజయ్ చెప్పారు.

అలాగే బీజేపీలో సీఎం అభ్యర్థిని ఎప్పుడూ ముందు ప్రకటించమని బండి సంజయ్ అన్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాతే గెలిచిన ఎమ్మెల్యేలు, అధిష్టానం కలిసి సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తారని పేర్కొన్నారు. ఎవరు సీఎం అని ముందుగానే ప్రకటించే సిస్టమ్‌ బీజేపీలో లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. అయితే.. తాను ఒకరిద్దరు చెబితే సీఎం అయ్యే వ్యక్తిని కాదనీ.. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తానెప్పుడూ కట్టుబడి ఉంటానని బండి సంజయ్ తెలిపారు. బీజేపీకి తాను ఎప్పుడూ మంచి కార్యకర్తనే అని చెప్పారు. ఇక మేడిగడ్డ బ్యారేజ్‌ బ్రిడ్జి కుంగింది వాస్తవమని.. పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పాల్పడ్డారని.. తిన్నదంతా కక్కిస్తామంటూ బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story