మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేసిన బీజేపీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ఇవాళ విడుదల చేసింది.
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 6:48 PM ISTమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ఇవాళ విడుదల చేసింది. ఈ జాబితాలో 99 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ విధానసభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. సంజయ్ ముకంద్ కేల్కర్ థానే అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. డోంబివాలి నుంచి అభ్యర్థిగా రవీంద్ర దత్తాత్రేయ చవాన్ ఎంపికయ్యారు. గోరేగావ్ అభ్యర్థిగా విద్యా జైప్రకాష్ ఠాకూర్ ఎంపికయ్యారు. నితీష్ నారాయణ్ రాణే కంకావలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కరద్ సౌత్ నుంచి ఛత్రపతి శివేంద్ర రాజే భోసలేకు టికెట్ ఇచ్చారు.
దేవేంద్ర ఫడ్నవీస్ గత మూడు సార్లు అంటే 2009, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ స్థానం నుంచి గెలుస్తూ వస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే కమతి నుంచి పోటీ చేయనున్నారు.
ఈ జాబితాలో మహిళల పేర్లను బీజేపీ హైలెట్ చేయడం గమనార్హం. జింటూరు అసెంబ్లీ స్థానం నుంచి మేఘనా బోర్డికర్‌కు పార్టీ టిక్కెట్ ఇచ్చింది. నాసిక్ వెస్ట్ నుంచి సీమతై మహేశ్ గిరేకు టికెట్ ఇచ్చారు. నవంబర్ 20న మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల్లో బీజేపీ 155, శివసేన 78, ఎన్సీపీ 55 స్థానాల్లో పోటీ చేయవచ్చని చెబుతున్నారు. రాష్ట్రంలో సామాజిక, కుల సమీకరణాలను కొనసాగించడానికి మహాయుతి కూటమి మిత్రులను కూడా తీసుకోవాలని యోచిస్తోంది. 2019 ఎన్నికల్లో బీజేపీ 164 సీట్లు గెలుచుకోగా.. అప్పటి అవిభక్త శివసేన 124 సీట్లు గెలుచుకుంది. మహారాష్ట్రలో నామినేషన్లు అక్టోబర్ 22 తేదీన ప్రారంభమై.. అక్టోబర్ 29న ముగియనుంది. నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 4, ఓటింగ్ తేదీ నవంబర్ 20. ఫలితాల తేదీ నవంబర్ 23.