కేసీఆర్ పై రైతులు తిరుగుబాటు చేసే రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉంది : విజ‌య‌శాంతి

BJP Leader Vijayashanti Fire On KCR. రైతుల పక్షాన నిలబడి భారత్ బంద్ లో పాల్గొన్న టీఆర్ఎస్‌ పై, సీఎం కేసీఆర్ తీరు పై బీజేపీ నేత

By Medi Samrat  Published on  9 Dec 2020 10:30 AM GMT
కేసీఆర్ పై రైతులు తిరుగుబాటు చేసే రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉంది : విజ‌య‌శాంతి

రైతుల పక్షాన నిలబడి భారత్ బంద్ లో పాల్గొన్న టీఆర్ఎస్‌ పై, సీఎం కేసీఆర్ తీరు పై బీజేపీ నేత, నటి విజయశాంతి విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతృత్వంలో జరిగిన బంద్‌లో చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చి మొత్తం క్రెడిట్‌ని హైజాక్ చెయ్యాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరాటపడ్డారని ఆరోపించారు.

''కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతృత్వంలో జరిగిన బంద్‌లో చివరి క్షణంలో ఎంట్రీ ఇచ్చి మొత్తం క్రెడిట్‌ని హైజాక్ చెయ్యాలని తెలంగాణ సీఎం కేసీఆర్ గారు తెగ ఆరాటపడ్డారు. సీఎం గారి ఎత్తుగడలు జీర్ణించుకోలేక కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కొత్త వ్యూహంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా రైతుల పక్షాన బంద్ చేశామని చెబుతున్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు త్వరలో కేసీఆర్ గారి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాలపై ఆందోళన చెయ్యాలని నిర్ణయించినట్లు ఆ పార్టీల నేతలు చెబుతున్నారు. దీని ద్వారా కేసీఆర్‌ను కూడా ఇరకాటంలో పెట్టాలని వారి వ్యూహం. రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తూ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల బంద్ పిలుపునకు మద్దతిచ్చిన కేసీఆర్ గారు, మరి ఆ పార్టీలు తెలంగాణలో చేసే ఆందోళనల్ని కూడా సమర్థిస్తారా? రైతు బంధునని చెప్పుకుని, ఫాంహౌస్ రాజకీయాలతో రాబందులా వ్యవహరించే సీఎం దొరగారి నిజ స్వరూపం తెలియడం వల్లే ఆయన తుపాకి రాముడు మాటలను నమ్మలేక దుబ్బాక ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన రైతులు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉంది'' అని విజయశాంతి పేర్కొన్నారు.


Next Story
Share it