టీఆర్ఎస్ నాయకులు ఎనిమిదేళ్లుగా చేసిన పాపాలు పండుతున్నాయని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకురాలు విజయశాంతి అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై స్పందించారు. ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర ఉందా లేదా అనేది దర్యాప్తు సంస్థలు తేలుస్తాయని అన్నారు. తప్పు చేయనప్పుడు భయమెందుకు అని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ ఇప్పుడు వరకు తేల్చింది గోరంత, బయటకు రావాల్సింది కొండంత ఉందని చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు శుక్రవారం రాత్రి సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీఆర్‌పీసీ 160కింద నోటీసులు ఇచ్చింది. ఈ నెల 6న హైదరాబాద్‌లోగానీ, ఢిల్లీలోగాని ఎక్కడైనా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇక నోటీసులపై కవిత స్పందించారు. తనకు సీబీఐ నుంచి నోటీసులు అందిన మాట వాస్తవమేనని చెప్పారు. "నా వివరణ కోరుతూ సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ నోటీసులు జారీ చేసింది. వారి అభ్యర్థన మేరకు ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్‌లోని నా నివాసంలో కలుసుకోవచ్చునని అధికారులకు తెలియజేశా. ఇంటివద్దే వారికి వివరణ ఇస్తా "అని కవిత తెలిపారు.