సీఎం కేసీఆర్‌కు బండి సంజ‌య్ బ‌హిరంగ లేఖ‌

BJP leader Bandi Sanjay open letter to CM KCR.బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సీఎం కేసీఆర్‌కు బ‌హిరంగ లేఖ రాశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 May 2022 9:25 AM GMT
సీఎం కేసీఆర్‌కు బండి సంజ‌య్ బ‌హిరంగ లేఖ‌

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సీఎం కేసీఆర్‌కు బ‌హిరంగ లేఖ రాశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 6 వేల కోట్ల భారాన్ని తెలంగాణ ప్రజలపై మోపుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేదా రిఫరెండమ్ కు సిద్ధం కావాలన్నారు. రెఫరెండం కు ప్రభుత్వం సిద్ధపడి ముందుకు రాకపోతే బీజేపీ తెలంగాణ శాఖ విద్యుత్ చార్జీల పెంపుపై రిఫరెండం నిర్వహిస్తుందని, దానికి మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

విద్యుత్‌ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ఆదర్శమని, వినియోగానికి మించి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నామంటూ ప్రగల్భాలు పలికే తెలంగాణ ప్రభుత్వం, మరి విద్యుత్‌ చార్జీలు పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో రాష్ట్రప్రజలకు చెప్పాలన్నారు. విద్యుత్‌ ఉత్పత్తిలో నిజంగా మిగులు రాష్ట్రమైతే.. ప్రజల నడ్డి విరిచి విద్యుత్‌ చార్జీలతో రాష్ట్ర ఖజానాను నింపుకునే చర్చలను విడనాడాల‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో అవి దివాలా తీసి అప్పుల ఊబిలో కూరుకుపోయాయని మండి పడ్డారు. రాష్ట్రం ప్రభుత్వం నుండి డిస్కంలకు చెల్లించాల్సిన 48 వేల కోట్ల బకాయిలు చెల్లించలేదన్నారు. డిస్కంలకు వినియోగదారులు చెల్లించాల్సిన బకాయిలు రూ.17వేల కోట్లు ఉంటే అందులో వివిధ ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన బకాయిలే 12,598 కోట్ల వరకు ఉన్నాయని గుర్తు చేశారు.

వినియోగదారులు చెల్లించాల్సిన బకాయిలు రూ.4,603 కోట్లు ఉన్నాయని, వీటిలో ఎక్కువ భాగం పాతబస్తీలో వసూళ్ళు కావాల్సిన బకాయిలే ఎక్కువ అని అన్నారు. పాతబస్తీలో ఎంఐఎంకు భయపడి వసూళ్ళు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. విద్యుత్‌ బిల్లుల వసూళ్లకు వెళుతున్న ప్రభుత్వ ఉద్యోగులపై పాతబస్తీలో యధేచ్ఛగా దాడులు జరుగుతున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. పాతబస్తీలోని ఉద్యోగస్తులకు తగిన రక్షన కల్పించి అక్కడ పాతబకాయిలను వసూలు చేయాలని డిమాండ్ చేశారు.విద్యుత్‌ సరఫరా తాలుకా సాంకేతిక నష్టాలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయని, ఈ నష్టాలు 2015-16 లో 14.01 శాతం ఉండగా.. 2019-20 నాటికి 21.54 శాతానికి పెరిగాయని, దీనికి కారణం మీ అసమర్థత పాలనే లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తికి ఇప్పుడున్న సాంప్రదాయ పద్ధతులు మినహా.. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలవైపు ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతను బృందాలుగా ఏర్పాటు చేసి, శిక్షణ ఇప్పించి సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు రుణాలు ఇస్తే యువతకు ఉపాధి, రాష్ట్రానికి చౌకగా కరెంటు దొరుకుతుందని తెలిపారు. అలా కాకుండా కమీషన్లకు కక్కుర్తిపడి అధిక ధరలకు ఇతర రాష్ట్రాలనుండి విద్యుత్‌ కొనుగోలు చేస్తే ఆ..భారం రాష్ట్ర ప్రజలపై పడుతుందని బండి సంజ‌య్ మండిపడ్డారు. రకరకాల పేరుతో పెంచిన 6 వేలకోట్ల విద్యుత్‌ ఛార్జీలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోందన్నారు. విద్యుత్‌ చార్జీల తగ్గింపు విషయంలో ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తే.. తెలంగాణ ప్రజలే టీఆర్‌ఎస్‌కు కరెంట్‌ షాక్‌ ఇస్తారని హెచ్చరించారు. రాష్ట్రప్రభుత్వం విద్యుత్‌ఛార్జీలు తగ్గించకపోతే శాంతియుతంగా గాంధేయ పద్ధతిలో ప్రజలతరుపున విద్యుత్‌చార్జీలు తగ్గించేవరకు బిజెపి ప్రజలపక్షాన నిలబడి పోరాటం చేస్తోందని.. బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.

Next Story