బండి సంజయ్ సంచలన ట్వీట్.. వారి నుంచి ఇంతకంటే ఇంకేం ఆశించగలం

Bandi Sanjay Sensational comments against TRS Goverment. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై వాస్త‌వాలు మాట్లాడార‌ని బండి సంజ‌య్ అన్నారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Sep 2022 7:39 AM GMT
బండి సంజయ్ సంచలన ట్వీట్.. వారి నుంచి ఇంతకంటే ఇంకేం ఆశించగలం

తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై వాస్త‌వాలు మాట్లాడార‌ని భార‌తీయ జ‌న‌తాపార్టీ(బీజేపీ) అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. అయితే.. తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ఎస్‌) మాత్రం గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ ముద్ర వేసి అవ‌మానిస్తున్నార‌ని మండిప‌డ్డారు. టీఆర్‌ఎస్‌ నేతలకు మహిళలను గౌరవించడం గానీ, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని పాటించడం గానీ తెలీదన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగ అనుచరుల నుంచి ఇంకా ఏం ఆశించగలం..? అని ఎద్దేవా చేశారు. గౌరవనీయులైన తెలంగాణ గవర్నర్ భారత రాజ్యాంగం ఆదర్శాలను అమలు చేయాలని, గవర్నర్ కార్యాలయాన్ని గౌరవించాలని, ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాలని అడుగుతున్నారని తెలిపారు. వివక్ష, అంటరానితనం, మాట్లాడే హక్కును టీఆర్ఎస్ హరిస్తుందంటూ బండి సంజ‌య్ ట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా బాధ‌త్య‌లు చేప‌ట్టి మూడేళ్లు పూర్తి అయిన సంద‌ర్భంగా గురువారం రాజ్‌భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై రాష్ట్ర ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయకపోవడం ద‌గ్గ‌ర నుంచి బాసర ట్రిపుల్‌ ఐటీలో పర్యటన వరకు అన్ని అంశాల్లోనూ తన అభిప్రాయాన్ని చాలా స్ప‌ష్టంగా కుండ బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్లు చెప్పారు. ఎట్ హోం కార్య‌క్ర‌మానికి వ‌స్తాన‌న్న సీఎం ఎందుకు రాలేదో చెప్పాల‌న్నారు. ప్ర‌భుత్వం గౌర‌వం ఇవ్వ‌క‌పోయినా తాను ప‌ని చేస్తాన‌ని చెప్పుకొచ్చారు.

గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై చేసిన వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్ నేత‌లు స్పందించారు. ఎమ్మెల్సీ కవిత, మంత్రులు జ‌గ‌దీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ లు స‌హా ప‌లువురు నాయ‌కులు గ‌వ‌ర్న‌ర్‌పై మండిప‌డ్డారు. నిత్యం వార్త‌ల్లో ఉండేందుకే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు. బీజేపీ నేతలా మాట్లాడడం మానేయాలంటూ సూచించారు. రాజ్‌భ‌వ‌న్‌ను ఉప‌యోగించుకుని గ‌వ‌ర్న‌ర్ బీజేపీకి ల‌బ్ధి చేకూర్చేందుకే ప్ర‌య‌త్నిస్తున్నారంటూ ఆరోపించారు. దేశంలో ప్ర‌ధాని, రాష్ట్ర‌ప‌తి త‌ర‌హాలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా పాల‌న సాగుతుంద‌న్నారు. ఈ క్ర‌మంలోనే బండి సంజ‌య్ ట్వీట్ చేశారు.

Next Story