హోంమంత్రి అమిత్‌షాతో బండి సంజయ్ భేటి, కీలక అంశాలపై చర్చ

తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలను అమిత్‌సాకు బండి సంజయ్‌ వివరించారు.

By Srikanth Gundamalla  Published on  24 July 2023 3:43 PM IST
Bandi Sanjay,  Home Minister Amit Shah, BJP, Telangana,

హోంమంత్రి అమిత్‌షాతో బండి సంజయ్ భేటి, కీలక అంశాలపై చర్చ

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని మార్చడంతో పాటు.. పలువురు నాయకులకు కీలక బాధ్యతలను అప్పజెప్పింది జాతీయ నాయకత్వం. ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడి గురించి హాట్‌ టాపిక్‌గా చర్చ జరుగుతోంది. కిషన్‌రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. దాంతో ఆయన పార్టీలో ఉన్న నాయకులపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో బండి సంజయ్ సమావేశం అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలను అమిత్‌సాకు బండి సంజయ్‌ వివరించారు. అంతేకాక గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తేయాలని కేంద్రమంత్రిని కోరినట్లు తెలుస్తోంది. ఇక పార్టీలో మార్పులు వచ్చాక తన వర్గాన్ని పక్క పెడుతున్నారంటూ బండి సంజయ్‌ ప్రస్తావించారని సమాచారం. తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ కోసం చేసిన పనులను అన్నింటినీ అమిత్‌షాకు గుర్తు చేశారు.

ఈ క్రమంలో బండి సంజయ్‌కి అమిత్‌షా పలు సూచనలు చేశారని తెలుస్తోంది. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని, మీడియా ముఖంగా పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడొద్దని సూచించినట్లు సమాచారం. అయితే.. తెలంగాణ అధ్యక్షుడి బాధ్యత కోల్పోయిన తర్వాత బండి సంజయ్‌, అమిత్‌షాతో తొలిసారిగా భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. బండి సంజయ్‌ తనని కలిసినట్లు అమిత్‌షా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను బండితో చర్చించినట్లు ట్విట్టర్‌లో అమిత్‌షా తెలిపారు. ఇక అమిత్‌షాతో బేటీపై ఇటు బండి సంజయ్‌ కూడా షేర్‌ చేసుకున్నారు. రాజకీయ చాణక్యుడు అమిత్‌షాను కలవడం ఆనందంగా ఉందంటూ పేర్కొన్నారు. అమిత్‌షా మార్గదర్శనంలో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పని చేస్తామని బండి సంజయ్ చెప్పారు.

కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసింది. తనపై జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు చేసినట్లుగా.. కిషన్‌రెడ్డిపై చేయొద్దని విజ్ఞప్తి చేశాడు. ఫిర్యాదుల వల్లే తన అధ్యక్ష పదవి పోయిందన్నట్లు మాట్లాడారు బండి సంజయ్. దాంతో పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయనే చర్చకు బలం చేకూరింది. ఈ క్రమంలోనే అంతర్గత వ్యవహారాల గురించి బయటకు మాట్లాడొద్దని బండి సంజయ్‌కి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సూచించినట్లు తెలుస్తోంది.

Next Story