కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చేందుకు కేసీఆర్ కుట్ర: బండి సంజయ్

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్‌ అన్నారు.

By Srikanth Gundamalla  Published on  14 Jan 2024 1:09 PM IST
bandi sanjay,  brs, kcr, congress govt ,

కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చేందుకు కేసీఆర్ కుట్ర: బండి సంజయ్

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బీజేపీ జాతీయ నేత బండి సంజయ్‌ అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారని అన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్‌పై బండి సంజయ్‌ తీవ్ర విమర్శలు చేశారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చని అన్నారు. కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని విమర్శించారు. కుట్రలకు కేసీఆర్‌ కేరాఫ్‌గా మారుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పోరాటం తర్వాత ముందు రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను బొందపెడతామని అన్నారు. కేసీఆర్ కదలికలపై కాంగ్రెస్‌వారు ఓ కన్నేసి ఉంచడం మంచిదంటూ వారికి సూచనలు చేశారు బండి సంజయ్.

ఇక తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు కావాలన్నా బీజేపీ గెలవాలన్నారు. యాదాద్రిలో కేసీఆర్ తన బొమ్మ చెక్కించుకున్నారనీ.. కానీ అయోధ్యలో మోదీ బొమ్మ కానీ.. అయోధ్యలో చుట్టుపక్కల భూములను కానీ కొనలేదని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలు ధార్మిక కేంద్రాన్ని వివాదాస్పదం చేస్తున్నాయని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య రామమందిరం కార్యక్రమానికి కాంగ్రెస్‌ నేతలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.

గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ నేతలు కూడా మొండిపట్టు వీడి బీజేపీ ఎంపీలు ఎక్కువ సంఖ్యలో గెలవాలని కోరుకోవాలన్నారు. రాష్ట్రంలో కలిసి అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. కాంగ్రెస్‌ ఐదేళ్ల పాటు సుస్థిర ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వాలను కూల్చే సంస్కృతి బీజేపీకి లేదనీ.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కాపాడుకుని ప్రభుత్వాన్ని నిలుపుకోవాలని బండి సంజయ్‌ సూచించారు.

Next Story