కాంగ్రెస్ పనైపోయింది.. గ్యారెంటీలతో వచ్చేదేం లేదు: బండి సంజయ్
తెలంగాణలో ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విమర్శల దాడులు క్రమంగా పెరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 5:45 PM ISTకాంగ్రెస్ పనైపోయింది.. గ్యారెంటీలతో వచ్చేదేం లేదు: బండి సంజయ్
తెలంగాణలో ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విమర్శల దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు ఆయా పార్టీలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని భైంసా మండలంలో బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.
కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణ రాలేదనీ.. తెలంగాణ ప్రజలందరి పోరాటం వల్లే తెలంగాణ ఏర్పడిందని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి సీఎం కేసీఆర్ భయం పుట్టిందన్నారు. ఈ తొమ్మిదేళ్లలో ఈ పనులు చేశామని కేసీఆర్ ఎక్కడైనా చెప్పారా అని ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పుకునేందుకు ఏమీ లేక కేవలం విపక్షాలను తిడుతున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పని ఖతం అయ్యిందని బండి సంజయ్ జోస్యం చెప్పారు.
కర్నాటకలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు స్కీమ్ లు అరడజను ముఖ్యమంత్రులు ఉంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గెలిచిన ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ లోకి వెళ్లకుండా ఉంటారా? అని ప్రశ్నించారు. కేంద్రంలో మరోసారి నరేంద్రమోదీ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్.. దేశంలో ఎక్కడుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇస్తే ఏంటి.. ఇయ్యకపోతే ఎంటని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు.. అమ్ముడుపోరని ఆ పార్టీ గ్యారంటీ ఇస్తుందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో గత ఎన్నికల్లో గెలిచిన దాదాపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పార్టీ మారారు అని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని.. ముథోల్‌లో బీజేపీ అభ్యర్థి రామారావుపటేల్‌కు ఓటు వేసి గెలిపించాలని బండి సంజయ్ కోరారు.