ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పొగడ్తల వర్షం కురిపించారు. బీజేపీని ఎదుర్కోవాలంటే, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మాత్రమే సమర్థవంతుడైన నేతని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కేసీఆర్ ను తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయం నుంచి చూస్తూనే ఉన్నానని, దక్షిణాదిన ఆయన గొప్ప భవిష్యత్ ఉన్న నేతని అన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌పై ఎనలేని గౌరవం ఉందని.. కాంగ్రెస్‌, టీడీపీ బలహీనపడటం వల్లే బీజేపీ ఓట్ల శాతం పెరిగిందన్నారు.

తాము చాలా తక్కువ సీట్లలోనే పోటీ చేశామని, అయినా తమ సీట్లను నిలుపుకున్నామని అన్నారు. తదుపరి రాజకీయ నిర్ణయాలపై పార్టీలో చర్చించి నిర్ణయిస్తామని, మేయర్, డిప్యూటీ మేయర్ విషయంలో టీఆర్ఎస్ అధినేతలతో మాట్లాడుతానని అన్నారు. ముస్లింలు, హిందువులు అందరూ ఎంఐఎంకు ఓటు వేశారని.. తమ పార్టీకి వచ్చిన ఫలితాలపై సమీక్ష జరుపుతున్నామన్నారు. గ్రేటర్‌లో బీజేపీ గెలుపు తాత్కాలికమేనని, దాని ప్రభావం రాష్ట్రంలో ఉండదని అన్నారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ తదితరులు పర్యటించిన డివిజన్లలో బీజేపీ ఓడిపోయిందని అన్నారు. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్న బీజేపీని ప్రజాస్వామ్య యుద్ధంలో ఓడించామని అన్నారు.


సామ్రాట్

Next Story