టీడీపీ, జనసేన ఉమ్మడిగా 'రా..కదలిరా' కార్యక్రమం: అచ్చెన్నాయుడు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో కొద్ది నెలలే సమయం ఉంది. రాజకీయ పార్టీలు ఎన్నికలపై పూర్తిగా కసరత్తులు మొదలుపెట్టాయి.
By Srikanth Gundamalla
టీడీపీ, జనసేన ఉమ్మడిగా 'రా..కదలిరా' కార్యక్రమం: అచ్చెన్నాయుడు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో కొద్ది నెలలే సమయం ఉంది. దాంతో.. ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికలపై పూర్తిగా కసరత్తులు మొదలుపెట్టాయి. ముఖ్యంగా ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ వరుస కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. రాష్ట్ర ప్రజలకు పెద్దగా చేసిందేమీ లేదని విమర్శిస్తోంది. అంతేకాదు.. రాష్ట్రంలో నియంతలా పాలన కొనసాగిస్తున్నారనీ.. ప్రశ్నిస్తే దాడులు, కేసులు పెట్టి గొంతు నొక్కే ప్రయత్నాలు చేశారని ఆరోపిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు కలిపి ఒక కొత్త లోగోను ఆవిష్కరించారు.
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ.. టీడీపీ 'రా కదిలిరా' కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ మేరకు లోగోను ఆ పార్టీ విడుదల చేసింది. జనసేన గుర్తు గాజుగ్లాసుతో పాటు.. సైకిల్ గుర్తు ఉండేలా కార్యక్రమం లోగోను ప్రారంభించారు. ఈ లోగోను రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. పంచాయతీల సమస్యలపై రేపు సర్పంచ్‌లతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. బీసీలకు జరిగిన అన్యాయంపై 4వ తేదీన జయహో బీసీ పేరిట రాష్ట్రస్థాయి సదస్సుకు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదు.. ఈ నెల 5వ తేదీ నుంచి 29వ వరకు 22 పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహిస్తారు.
పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఎన్టీఆర్ ఇచ్చిన రా కదిలిరా పిలుపునే మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు చెప్పారు అచ్చెన్నాయుడు. విధ్వంసాలు, వైఫల్యాలు తప్ప జగన్ పాలనలో అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని చీకటిమయం చేసి ఏపీకి నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారని సీఎం జగన్ పాలనను అచ్చెన్నాయుడు విమర్శించారు. స్వర్ణయుగం టీడీపీతోనే సాధ్యమని అన్నారు. అయితే..ఈ సభలు అన్నీ టీడీపీ, జనసేన సంయుక్తంగా జరుగుతాయని చెప్పారు. ఇక త్వరలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొనే సభలు త్వరలోనే ప్రకటిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు ఉండబోతున్నాయనీ.. వాటిని పట్ల ఆచితూచి వ్యవహరిస్తామని అన్నారు. అంతేకాదు.. మేనిఫెస్టో ప్రకటన సభను ప్రత్యేకంగా నిర్వహిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.