టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితాపై వైసీపీ తీవ్ర విమర్శలు

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  25 Feb 2024 11:32 AM GMT
andhra pradesh, politics, janasena, tdp, ycp, elections,

టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితాపై వైసీపీ తీవ్ర విమర్శలు

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్‌ 24 అసెంబ్లీ స్థానాలకు గాను ఐదుగురి పేర్లను ప్రకటించారు. మిగతావారి పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తమ గెలుపు ఎప్పుడో ఖాయమైందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే.. తాజాగా ఈ ఉమ్మడి జాబితాపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

జనసేనకు 24 సీట్లు ఆత్రమే కేటాయించడంపై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. 'పల్లకి మోయడం తప్ప పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేసారు.. ఛీ' అంటూ పవన్‌ను విమర్శించారు మంత్రి అంబటి రాంబాబు.

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితాపై స్పందించారు. ఆయన కూడా పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. జనసేనకు 24 స్థానాలు మాత్రమే కేటాయించారని చెప్పారు. పవన్ కళ్యాణ్‌ తనకు బలం లేదని ఒప్పుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు జనసేనను కూడా తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారంటూ సజ్జల విమర్శలు చేశారు. ఎప్పటికైనా జనసేన పార్టీ టీడీపీ అనబంధ విభాగమేనంటూ విమర్శలు చేశారు. జనసేన అభ్యర్థులుగా ఎవరు ఉండాలనేది కూడా చంద్రబాబే నిర్ణయిస్తున్నాడనీ.. అలాంటప్పుడు సపరేట్‌గా పవన్‌కు పార్టీ ఎందుకు అని ప్రశ్నించారు? పవన్ కళ్యాణ్‌ ఇక టీడీపీ ఉపాధ్యక్షుడిగా మారితే బావుంటుందంటూ సజ్జల ఎద్దేవా చేశారు.

టీడీపీ, జనసేన రెండు పార్టీ అధ్యక్షులు కలిసి శనివారం ఉమ్మడిగా ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేశారు. మొత్తం 118 స్థానాలను పంచుకున్నారు. ఇందులో టీడీపీ నుంచే 94 మంది అభ్యర్థులు ఉన్నారు. జనసేన నుంచి 24 అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ కూడా ఈ పొత్తులో భాగం అవ్వడంపై చర్చలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో బీజేపీ కూడా చేరిక అంశంపై క్లారిటీ వచ్చాక మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించున్నారు.

Next Story