నేడే టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితా.. 65 మందికి చాన్స్!

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  24 Feb 2024 2:25 AM GMT
andhra pradesh, elections, tdp, janasena, first list,

నేడే టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితా.. 65 మందికి చాన్స్! 

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దాంతో.. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలోనూ అన్ని విధాలా ముందుకెళ్తున్నాయి. అయితే.. ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాలు ఎలా ఉంటాయి? ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తారనేది ఉత్కంఠగా మారింది. ఈక్రమంలో నేడే టీడీపీ, జనసేన అబ్యర్థుల తొలి జాబితా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. శనివారం మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో మొదటి విడత అభ్యర్థుల పేర్లను వెల్లడించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉదయం 11.40 నుంచి 11.47 గంటల మధ్య ముహూర్తం బాగుందనీ.. దాంతో పవన్, చంద్రబాబు కలిసి తొలి జాబితాను విడుదల చేస్తారని తెలుస్తోంది. తొలి జాబితాలో ఉమ్మడిగా 65 మంది వరకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మెజారిటీ సీట్లకు సంబంధించిన అభ్యర్థుల జాబితాలను టీడీపీ, జనసేన అధ్యక్షులు ఇప్పటికే తయారు చేసినట్లు తెలుస్తోంది. వందకు పైగా సీట్లకు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసినట్లు సమాచారం. మొదటి జాబితాను ఫిబ్రవరి రెండో వారంలోనే విడుదల చేయాలని భావించారట. కానీ.. బీజేపీ పొత్తులోకి రావడంతో వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి ఇచ్చే సీట్లపై స్పష్టత రావడంతో జాబితాను ప్రకటించేందుకు సిద్ధమయ్యారని ఆయా పార్టీల వర్గాలు చెబుతున్నాయి. అదీకాక.. ఇది అత్యంత మంచి ముహూర్తం అనీ.. ఇది పోతే మరో రెండు వారాల వరకు ఇలాంటి ముహూర్తాలు లేని పండితులు చెప్పడంతో తొలి జాబితా విడుదలకు టీడీపీ, జనసేన పార్టీలు సిద్ధం అయ్యాయి. అయితే.. తొలిజాబితాను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి విడుదలచేయనున్నట్లు సమాచారం. ఈ జాబితాలో 65 మంది అభ్యర్థులుంటే.. వీరిలో టీడీపీ నుంచి 50-52 మంది, జనసేన నుంచి సుమారు 15 మంది ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు తప్ప దాదాపుగా అన్ని స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. కుప్పంలో చంద్రబాబు, భీమవరంలో పవన్ కళ్యాణ్‌ పోటీ చేస్తారు. ఇక అచ్చెన్నాయుడు టెక్కలిలో, మంగళగిరి నుంచి లోకేశ్, తెనాలి నుంచి జనసేన నేత నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మరోసారి సీట్లు ఇస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు. కానీ.. గంటా శ్రీనివాసరావు విషయంలో మాత్రం కాస్త ఉత్కంఠ నెలకొంది. ఆయన్ని చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని టీడీపీ భావిస్తోంది. కానీ.. అందుకు గంటా శ్రీనివాసరావు మాత్రం సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనం. ఇలా రెండుమూడు నియోజకవర్గాలు మనిహా దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలనే తొలి జాబితాలో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story