తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనేది ప్రజల ఆకాంక్ష అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విమోచన దినోత్సవ కార్య్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో అమిత్ షా మాట్లాడారు.
భారత దేశానికి స్వాత్రంత్యం వచ్చిన ఏడాది తరువాత హైదరాబాద్ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఆనాటి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ కృషితోనే నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రాంత ప్రజలకు విముక్తి లభించిందన్నారు. ఎంతో మంది స్వాతంత్య్రం కోసం బలిదానాలు చేశారని సర్దార్ పటేల్ లేకపోతే తెలంగాణ విమోచనం మరింత ఆలస్యమయ్యేదన్నారు. సర్దార్ పోలీస్ యాక్షన్ ద్వారానే తెలంగాణ విమోచనం అయిందన్నారు. నిజాం రాజ్యంలో అరాచకాలను ఇప్పటికీ మరువలేము. ఇంకా కొంత మంది మనుషుల్లో రజాకార్ల భయం ఉంది. భయాన్ని వదిలేసి ధైర్యంగా బయటికి రావాలని సూచించారు.
ఇక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలనేది ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవాన్ని జరుపలేదు. కొందరు ఇతర పేర్లతో ఉత్సవాలు జరుపుతున్నారు. విమోచన పేరుతోనే ఉత్సవాలు జరపాలన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కేసీఆర్ విమోచన దినాన్ని అధికారికంగా జరపలేదన్నారు. ఈ రోజు జాతీయ జెండాను ఎగురవేయడం సంతోషంగా ఉందని చెప్పారు.