మళ్లీ వైసీపీలోకి ఆళ్ల రామకృష్ణారెడ్డి?

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు నెలల క్రితం పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీని వీడారు.

By అంజి  Published on  20 Feb 2024 7:30 AM GMT
alla ramakrishna reddy, ysrcp, APnews

మళ్లీ వైసీపీలోకి ఆళ్ల రామకృష్ణారెడ్డి

ఏపీ: మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు నెలల క్రితం పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీని వీడారు. ఆ తర్వాత వైఎస్ షర్మిల సమక్షంలో ఏపీ కాంగ్రెస్‌లో చేరి తన రాజకీయ భవిష్యత్తు షర్మిలతోనే అని ప్రకటించారు. వైసీపీలో తనకు అవమానం జరిగిందని, మళ్లీ ఆ పార్టీలోకి రాకూడదని కోరుకుంటున్నానని అన్నారు. అయితే ఇప్పుడు అంటే.. రెండు నెలల తర్వాత ఆళ్ల రామకృష్ణా రెడ్డి మళ్లీ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. త్వరలో సీఎం వైఎస్‌ జగన్‌తో రామకృష్ణారెడ్డి భేటీ అవబోతున్నారని, ఆయన మళ్లీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

వైసీపీని వీడి షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్‌లో చేరినప్పుడు ఆర్కే తన వాట్సాప్ డిస్‌ప్లే చిత్రాన్ని ఇందిరాగాంధీ ఫోటోగా మార్చారని కొన్ని మీడియా ఛానళ్లు వార్తలు నడుపుతున్నాయి. అయితే ఆయన వాట్సాప్ చిత్రాన్ని మళ్లీ వైఎస్ జగన్‌గా మార్చారని చెబుతున్నాయి. ఆర్కే నిష్క్రమణ తర్వాత మంగళగిరి నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గంజి చిరంజీవి పేరు ప్రచారంలోకి వచ్చింది. బీసీ మహిళను రంగంలోకి దింపాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు వైసీపీ అనుకూల మీడియా కథనాలు ప్రసారం చేసింది.

అయితే రామకృష్ణా రెడ్డి రీఎంట్రీతో ఇప్పుడు ఈ సమీకరణాలన్నీ పూర్తిగా మారనున్నాయి. రామకృష్ణ వైసీపీలో చేరితే మంగళగిరి నుంచి మళ్లీ నారా లోకేశ్‌పై ఆ పార్టీ అభ్యర్థి అవుతారా? అనేది తేలాల్సి ఉంది. ఇదిలావుంటే, గత రెండు నెలలుగా వైసీపీని వీడి షర్మిలతో ప్రచారం నిర్వహించి మళ్లీ వైసీపీ తలుపు తట్టాలని చూస్తున్నా ఆర్కే డ్రామాను మంగళగిరి ప్రజానీకం ఎలా చూస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.

Next Story