ఒక్క సీటు కాంగ్రెస్ కు ఇస్తాం.. తీసుకుంటే తీసుకోండి!!

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో ఒకదానిని మాత్రమే ఇస్తామని ఆఫర్ ఇచ్చింది.

By Srikanth Gundamalla  Published on  13 Feb 2024 2:30 PM GMT
aap, offer, congress, one seat, lok sabha election, delhi,

ఒక్క సీటు కాంగ్రెస్ కు ఇస్తాం.. తీసుకుంటే తీసుకోండి!!

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో ఒకదానిని మాత్రమే ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ చెప్పినట్లు చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధంగా లేదు. ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్, కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ముందు సీట్ల పంపకాలను ఖరారు చేసేందుకు ఇండియా కూటమి భాగస్వామి కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతోంది. ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ మాట్లాడుతూ, “మెరిట్ ప్రాతిపదికన చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో పోటీ చేయడానికి ఒక్క సీటుకు కూడా అర్హత లేదు, కానీ కూటమి ధర్మాన్ని దృష్టిలో ఉంచుకుని మేము వారికి ఒక సీటు ఇస్తున్నాము. ఢిల్లీ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ ఒక స్థానంలో, ఆప్‌ ఆరు స్థానాల్లో పోటీ చేయాలని మేము ప్రతిపాదిస్తున్నాం." అని అన్నారు.

ప్రాథమిక చర్చల్లో భాగంగా ఢిల్లీలో 4:3 సీట్ల షేరింగ్ ఫార్ములా జరిగే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుంది. ఆప్ మూడు స్థానాల్లో పోటీ చేయాలని భావించింది. అయితే ఏకాభిప్రాయాన్ని సాధించడంలో పార్టీలు విఫలమయ్యాయని పాఠక్ ప్రకటన ద్వారా తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికలలో, దేశ రాజధానిలోని మొత్తం ఏడు స్థానాలను బీజేపీనే కైవసం చేసుకోగా, కాంగ్రెస్, ఆప్ బోణీ చేయలేకపోయాయి. ఇండియా కూటమి మిత్రపక్షాల మధ్య విభేదాలు కొనసాగుతూ ఉండగా.. ఈ ఆఫర్ వచ్చింది. పంజాబ్‌, ఢిల్లీలో ఆప్ 13 లోక్‌సభ స్థానాలలో సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది.

Next Story