మన ప్రజా ప్రతినిధుల్లో కొందరు ఎంతటి ఘనులో తాజాగా సుప్రింకోర్టు విచారణలో భాగంగా బయటపడింది. దేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాల్లో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిపై ఎన్ని కేసులున్నాయి, వాటి తీవ్రత ఏమిటి అనే విషయంలో అమికస్ క్యూరి విజయ్ హన్సారియా  సుప్రింకోర్టుకు వివరించారు. హన్సారియా అందించిన లెక్కల ప్రకారం దేశంమొత్తం మీద తాజా, మాజీ ప్రజా ప్రతినిధులపై 4442 మందిపై తీవ్రమైన కేసులున్నాయి. యావజ్జీవ శిక్షలు పడేస్ధాయిలో నేరాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారట. ఈ మొత్తంలో గమనించాల్సిన విషయం   ఏమిటంటే  ఏపిలో 145, తెలంగాణాలో 118 మంది తాజా, మాజీ ప్రజా ప్రతినిధులుండటం.

ఏపిలో లెక్కలు తీసుకుంటే ఏపిలో 6 మంది ఎంపిలపై వివిధ రకాల నేరాభియోగాలున్నాయి. అలాగే 79  మంది సిట్టింగ్ ఎంఎల్ఏలపైన కూడా అనేక కేసులున్నాయి.  7 మంది మాజీ ఎంపిలపైనే కాకుండా 53 మంది మాజీ ఎంఎల్ఏలపైన కూడా అనేక రకాల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ కేసుల విచారణలో 3 కేసులపై స్టే ఉంది. ఇక  తెలంగాణా విషయం చూస్తే ఇంతకన్నా తక్కువేమీ తినలేదు. 107  మంది సిట్టింగ్ ఎంపిలు, ఎంఎల్ఏలు అనేక రకాల కేసులు ఎదుర్కొంటున్నారు. 11 మంది మాజీ, తాజా ఎంపిలు, ఎంఎల్ఏలపైన కూడా అనేక కేసులున్నాయి. 4 కేసుల్లో స్టే ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్నాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టుల్లో కూడా విచారణలు పెండింగ్ లో ఉన్నాయట. అంటే ఎక్కడికక్కడ నేతలు విచారణ ముందుకు సాగకుండా మ్యానేజ్ చేసుకుంటున్నారా ? అనే అనుమానాలు వస్తున్నాయి. ఏపిలోని తాజా, మాజీ ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల్లో విచారణ వెంటనే జరిగితే కనీసం 2 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశాలున్నట్లు అమికస్ క్యూరి అభిప్రాయపడ్డారు. పదేళ్ళు జైలుశిక్ష  పడే కొన్ని కేసులు  ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్నాయట.

కేసుల విచారణకు అమికస్ క్యూరి కొన్ని సూచనలు చేశారు. ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులు వెంటనే విచారణ జరిగి శిక్షలు పడాలంటే ముందుగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలట. అలాగే తాజా ప్రజా ప్రతినిధులపైన నమోదైన కేసులను ప్రాధాన్యత క్రమంలో విచారణ చేయాలన్నారు. ప్రత్యేక కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసుల్లో నెల రోజుల్లోపు నివేదికలు ఇచ్చేలా ఫోరెన్సిక్ ల్యాబులను ఆదేశించాలని కూడా సూచించారు. మొత్తం మీద మన ప్రజా ప్రతినిధుల్లో కొందరు ఎటువంటి వాళ్ళనే విషయం కోర్టు విచారణలో బయటపడింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *