మావోయిస్టుల కదలికలపై సరిహద్దుల్లో పోలీసుల ఏరియల్ సర్వే
By సుభాష్ Published on 12 Sep 2020 3:12 AM GMTతెలంగాణ-ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లో మవోయిస్టులు రెచ్చిపోతున్నారు. ఈ మధ్యన తెలుగు రాష్ట్రాల్లో మావోల కదలికలు ఎక్కువయ్యాయి. ఇటీవల సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌లు కూడా జరిగాయి. ఈనేపథ్యంలో తెలంగాణ-ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. గత కొన్ని రోజులుగా ఏవోబీలో మావోయిస్టుల కదలికలు పెరిగిపోవడంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. రెండు రోజుల కిందట ఒడిశాలోనికలహండి జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య రెండు సార్లు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతం, ఇద్దరు జవాన్లు మృతి చెందారు. దీంతో ఏవోబీలో భారీ సంఖ్యలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న విషయం పోలీసులు నిర్ధారించుకున్నారు.
ఈ క్రమంలో ఆంధ్రా, ఒడిశాకు చెందిన నిఘా విభాగం దండకారణ్యం సహా ఏవోబీలో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. చిత్రకొండ పోలీసుస్టేషన్ పరిధిలోని అల్లూరి కోట పప్పులూరు, కప్పటితోట్టి, కుర్మనూరు, ఆంధ్రాలోని గుమ్మిరేవుల, పాతకోట, సీలేరు, గూడెం కొత్త వీధి తదితర అటవీ ప్రాంతాల్లో పోలీసులు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు.