అర్థరాత్రి నుంచి దేశమంతా లాక్‌డౌన్‌

By అంజి  Published on  24 March 2020 2:50 PM GMT
అర్థరాత్రి నుంచి దేశమంతా లాక్‌డౌన్‌

ఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీ.. కరోనా వైరస్‌పై జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. జనతా కర్ఫ్యూను దేశ ప్రజలు విజయవంతం చేశారని, చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాని అన్నారు. పరీక్షా సమయంలో తమ పాత్రను చక్కగా నిర్వర్తించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఈ రోజు అర్థరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులోకి వస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. లాక్‌డౌన్‌ అంటే కర్ఫ్యూలాంటిదేనని అన్నారు. ప్రజలు నిబంధనలు ఉల్లంఘించరాదని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని మోదీ కోరారు. మూడు వారాల పాటు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందన్నారు.

లాక్‌డౌన్‌ లక్ష్మణ్‌ రేఖను ఎవరూ దాటొద్దన్నారు. ఏప్రిల్‌ 14వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందన్నారు. ప్రధానిగా చెప్పడం లేదని.. మీకుటుంబ సభ్యుడిగా ఇస్తున్న సందేశమని చెప్పారు. కరోనా అంటే.. ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమని అర్థం అన్నారు. ఈ ఒక్క అడుగే కరోనాపై జయించడానికి నాంది పలుకుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు రోడ్లపైకి రావొద్దు.. ఇదే నా సందేశమన్నారు. ఈ 21 రోజులు చాలా కీలకమన్నారు. కరోనా సైకిల్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ఇదే పరిష్కారమన్నారు. ఈ ఒక్క అడుగే కరోనాపై జయించడానికి నాంది పలుకుతుందని మోదీ వ్యాఖ్యనించారు. కష్టకాలంలో మెడికల్‌ సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేమన్నారు.

అన్నిటికంటే ప్రాణం విలువైనదని.. జీవం ఉంటేనే జీవితం ఉంటుందని మోదీ అన్నారు. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వాలు బ్రహ్మాండంగా పోరాటం చేస్తున్నాయని అన్నారు.

కేంద్ర ఆరోగ్యశాఖకు అత్యవసరంగా రూ.15 వేల కోట్లు విడుదల చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంపైనే దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ సూచించారు. సొంత వైద్యం పనికి రాదని.. వైద్యుల సూచన మేరకే మందులు వేసుకోవాలన్నారు.

కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో అభివృద్ధి చెందిన దేశాలు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాయని చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది.. ఇలాంటి సమయంలో మనమంతా ఒక్కటిగా నిలవాలన్నారు.



Next Story