ఎండ తీవ్రత అధికంగా ఉన్నా కరోనా వ్యాపిస్తోంది
By తోట వంశీ కుమార్
కరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్, హరియాణా, మిజోరాం రాష్ట్రాల సీఎంలను అడిగి.. ఆయా ప్రాంతాల్లో కరోనా ప్రస్తుత పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా ఉందన్నారు. మార్చి1న అగ్రరాజ్యం అమెరికాలో 75 కేసులు నమోదు కాగా.. నేటికి ఆ సంఖ్య 14వేలకు చేరిందని తెలిపారు. ఎండ తీవ్రతకు కరోనా వైరస్ వ్యాపించదనడంపై ఆలోచించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సౌధీ అరేబియాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నా.. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్‌తో పాటు ఇరు రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులు ఈటల రాజేందర్, ఆళ్లనాని ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
భారత్లో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రానికి 223 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 52 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా భారత్‌లో నలుగురు మృత్యువాత పడ్డారు.