గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్
By తోట వంశీ కుమార్ Published on 7 May 2020 11:41 AM ISTవిశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి ఫోన్ చేసి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రధానికి వివరించారు జగన్. పరిస్థితి అదుపులోనే ఉందని, బాధితులకు వైద్య సహాయం అందిస్తున్నామని వెల్లడించారు. కేంద్రం ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయసహకారాలు ఉంటాయని ప్రధాని భరోసా ఇచ్చారు.మరోవైపు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా సీఎం జగన్‌కు ఫోన్ చేశారు. ప్రమాద కారణాలు సహా, సహాయక చర్యలను గవర్నర్‌కు జగన్ వివరించారు.
ఏపీ గవర్నర్ దిగ్భాంత్రి..
ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ద ప్రాతిపదికన అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెడ్ క్రాస్ వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. తక్షణమే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని విశాఖ రెడ్‌క్రాస్ ను ఆదేశించారు.