కరోనా విజృంభణ నేపథ్యంలో.. పది రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Aug 2020 2:11 PM IST
కరోనా విజృంభణ నేపథ్యంలో.. పది రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భేటి అయ్యారు. వివిధ రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రతపై సమీక్ష చేపట్టారు మోదీ. ఈ సమీక్షలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్, బీహార్‌‌ రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు.

లాక్‌డౌన్‌ తర్వాత పరిస్థితులు, అన్‌లాక్‌ 3 అమలు జరుగుతున్న తీరుతెన్నులపై ముఖ్యమంత్రులను ప్ర‌ధాని అడిగి తెలుసుకుంటున్నారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు ప్రధానికి వివరిస్తున్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, వైద్య ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌, హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఈ సమీక్షకు హాజరయ్యారు. తెలంగాణ త‌ర‌ఫున సీఎం కేసీఆర్‌తోపాటు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

కాగా.. గడిచిన 24గంటల్లో 53,601 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 871 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,68,676కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 15,83,490 మంది కోలుకుని నుంచి డిశ్చార్జి కగా.. 6,39, 929 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 45,257 మంది మృత్యువాత పడ్డారు.

Next Story