హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే కరోనా మృతుల సంఖ్య 6,500 దాటిందంటే.. వైరస్‌ విజృంభణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలోనూ కరోనా పాజిటివ్‌ కేసులు 100 దాటడం గమనార్హం. రోజు రోజుకూ దేశంలో కేసులు పెరుగుతున్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్‌ అయ్యాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా కరోనా మహమ్మారిపై ఆందోళన చెందవద్దని దేశ ప్రధాని నరేంద్రమోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వదంతులు ఎంతమాత్రం నమ్మొదని చెప్పినా.. ఆయన వైరస్‌ పట్ల మాత్రం అజాగ్రత్తగా ఉండొద్దన్నారు. చిన్న చిన్న చిట్కాలతో కరోనా వైరస్‌ను అరికట్టవచ్చని మోదీ సూచించారు.

ఈ విషయాన్ని ఓ వీడియో రూపంలో సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. చాల మంది తరచుగా తమ చేతులతో ముఖాన్ని తడుముతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉంది. అందుకే శుభ్రంగా చేతులు కడుక్కోవాలని, తరచూ ముఖాన్ని, కళ్లను చేతితో తాకవద్దన్నారు. ఒకవేళ వైరస్‌ వచ్చినట్లు మీకు అనుమానం వస్తే మాత్రం.. దగ్గరలో ఉన్న వైద్యుడిని వెంటనే కలవాలంటూ ప్రధాని మోదీ సూచనలు చేశారు. వ్యక్తిగత శుభ్రత అనేది చాలా అవసరమని మోదీ అన్నారు. కరోనా వైరస్‌ సోకిన వారు ఇప్పటికే క్వారంటైన్‌ ఆస్పత్రిలో ఉన్నారని చెప్పారు. దాదాపు ఏడు నిమిషాల నిడివి గల వీడియోను ఆయన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. స్కూళ్లు, కాలేజీలు, స్విమ్మింగ్‌ఫూల్స్‌తో పాటు సినిమా థియెటర్లను మూసివేశాయి. అన్ని ఎయిర్‌పోర్టుల్లోనూ థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.