ప్రాణం పోస్తున్న ప్లాస్మా..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  4 Aug 2020 3:02 PM GMT
ప్రాణం పోస్తున్న ప్లాస్మా..!

కరోనా ఇంకా ఎన్నాళ్ళుంటుంది? ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం వైద్యులు ప్రభుత్వాల వల్ల కావట్లేదు. ఓ రకంగా ఇది జవాబు దొరకని ప్రశ్న. కొందరు మాత్రం ఆ ఏముంది ఆ వ్యాక్సిన్‌ వచ్చిందంటే చాలు ఇక రోజుల్లోనే తగ్గిపోదూ అంటున్నారు. నిజవే కావచ్చు. మరి వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందంటే రీసెర్చి చేస్తున్నారుగా వారూ చాలా వేగంగానే చేస్తున్నారు లేండి. ఈ నెలాఖరుకో వచ్చే నెల మొదట్లోనే వచ్చేసేలా ఉంది అంటూ చాలా ధీమాగా బదులిస్తున్నారు. అక్కడికి వారికి రోజూవారి అప్‌డేట్లు అందుతున్నట్టు. కానీ ఇంకొందరు మాత్రం అబ్బే వ్యాక్సిన్‌ రావడం అంటే మాటలు కాదండి. తక్కువలో తక్కువ 18 నెలలు పడుతుంది అంటూ పెదవి విరుస్తున్నారు.

ఇటు వ్యాక్సిన్‌ లేక అటు కరోనా ఉధృతి తగ్గక పరిస్థితి ఆగమాగమవుతోంది. ఎప్పుడో వచ్చే వ్యాక్సిన్‌ సరే ఇప్పడేం చేయాలి? కరోనా విషకోరల్లోంచి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? అని కోట్లాది ప్రజల ప్రశ్నకు ఇప్పటికిప్పుడు దొరికే సమాధానం ...ప్లాస్మా.

ఎస్‌ మీరు విన్నది నిజమే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్మా వైద్యం ద్వారా కరోనాను కట్టడి చేసే వీలుంది అంటున్నారు వైద్యులు. హైదరాబాద్‌లోని గాంధీ వైద్యులు ఈ తరహా ప్లాస్మా థెరఫీలు చేసి కరోనా పేషెంట్ల ప్రాణాలు నిలపగలుగుతున్నారు. కోవిడ్‌ నోడల్‌ కేంద్రం సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరఫీ చికిత్స ద్వారా వందశాతం సత్ఫలితాలు సాధించారు. ఐసీఎంఆర్‌ ఇటీవల దేశవ్యాప్తంగా ప్లాస్మా థెరఫీ చికిత్సల్లో ఏ రాష్ట్రం ముందంజగా ఉందన్న విషయంగా పరిశీలించి ఇచ్చిన గ్రేడింగ్‌లలో గాంధీ ఆస్పత్రికి అయిదో ర్యాంకు వచ్చింది. అయితే కేటాయించిన కోటా పూర్తవడంతో ప్రస్తుతం అక్కడ ప్లాస్మా చికిత్స నిలిపివేశారు.

కొద్ది రోజుల కిందట సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ప్రయోగాత్మకంగా ప్లాస్మా థెరఫీ చికిత్స ప్రారంభించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న 25 మంది రోగులకు ఈ తరహా చికిత్స చేస్తే ఆశ్చర్యంగా వారంతో కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఈ ప్లాస్మా చికిత్స మే 14న ప్రారంభమైంది. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉన్న ఓ యువకుడికి 200 మి.మి. ప్లాస్మా ఎక్కించారు. శరీరం స్పందించడంతో మే 16న మరో డోసు ఇచ్చారు. రోగి పూర్తిగా కోలుకుని వారంలోగా డిశ్చార్జయ్యాడు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో కొనసాగించారు. అయితే ఇప్పుడో అప్పుడో వ్యాక్సిన్‌ రావడం ఖాయం అంటున్న నేపథ్యంలో మందు వచ్చేదాకా ఈ చికిత్సను కొనసాగించాలా? లేదా దీన్ని కరోనా చికిత్సలో భాగం చేయాలో అన్న విషయంగా ఐసీఎంఆర్‌ ఆలోచిస్తోంది.

కోలుకున్న వారే ఇవ్వాలి..

కరోనాతో పోరాడి గెలిచిన వారిలో టి కణాలు వృద్ధి అయి ఉంటాయి. ఇలాంటి వారి ప్లాస్మా బాధితులకు రోగనిరోధకతను కల్పిస్తుంది. అందుకే రక్తదానంలాగే ప్లాస్మా దానం కూడా ఓ ఉద్యమంలా చేయించాలని కొందరంటున్నారు. నగరమేయర్‌ బొంతు రామ్మోహనరావు, ప్రముఖ సినీదర్శకుడు రాజమౌళి కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అంతేకాదు కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మాదానం చేసి సాటి మనుషుల ప్రాణాలను నిలబెట్టాలని. తమకు వచ్చిన ఈ సదవకాశాన్ని జారవిడుచుకోరాదని క్యాంపేన్‌ చేస్తున్నారు. కొందరు ప్లాస్మా ముఖ్యం అంటున్నారు మరి ఇస్తే ఏమవుతుందోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. అయితే అలాంటిదేం ఉండదని డాక్టర్లు అంటున్నారు. డ్రైఫ్రూట్‌లు పౌష్టికాహారం తీసుకుంటే యాంటీబాడీలు పెరుతుంటాయని కోలుకున్న కొందరంటున్నారు.

ప్లాస్మా థెరఫీ ఎలాగూ మంచి ఫలితం ఇస్తోంది కాబట్టి దీనిపై ప్రభుత్వం విస్తృత ప్రచారం చేయాలి. టీవీల్లో ప్రకటనలు ఇవ్వాలి. ప్లాస్మా ఎలా ఉపయోగపడుతుందో అనడంతోపాటు, ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లచే చెప్పించాలి. అసలైన వ్యాక్సిన్‌ వచ్చేదాక మనముందున్న ప్రత్యమ్నాయం ఇదే కాబట్టి దీనిపై దృష్టి సారించాలి.

Next Story