ఇదే జోరు సాగితే.. దసరా నాటికి లీటరు వంద గ్యారెంటీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Jun 2020 12:17 PM IST
ఇదే జోరు సాగితే.. దసరా నాటికి లీటరు వంద గ్యారెంటీ

ఎవరేమన్నా అనుకోని. ఎంత గింజుకున్నా.. కిందా మీదా పడ్డా పట్టించుకోకుండా తాము అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుపోవటంలో కొన్ని ప్రభుత్వాలు మహా తెలివిగా వ్యవహరిస్తుంటాయి. ఇప్పుడా కోవలోకే వస్తుంది కేంద్రంలోని మోడీ సర్కారు. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు నేల చూపులు చూస్తున్న వేళ.. రికార్డు ధరలకు పెట్రోల్.. డీజిల్ ధరలు పెరిగేలా చేయటంలో మోడీ సర్కారు సక్సెస్ అవుతుందని చెప్పాలి. ఓపక్క మహమ్మారి.. మరోపక్క లాక్ డౌన్.. వెరసి సామాన్యుడి నుంచి సంపన్నుడు వరకు అంతా కిందామీదా పడే పరిస్థితి.

వరుస పెట్టి 20 రోజులుగా పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. దీంతో.. హైదరాబాద్ లో లీటరుపెట్రోల్ ధర రూ.83కు చేరితే.. డీజిల్ ధర రూ.80కు కాస్త అటు ఇటుగా ఉన్న పరిస్థితి. ఇక.. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటరు రూ.80.13కు చేరితే.. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో డీజిల్ ధర లీటరు రూ.80.19కు చేరింది. దీంతో.. అన్ని వర్గాల వారు హాహాకారాలు చేస్తున్నారు.

ఇదే రీతిలో పెట్రోల్.. ధరలు పెంచుకుంటూ పోతే దసరా నాటికి కచ్ఛితంగా లీటరు పెట్రోల్.. డీజిల్ ధరలు రూ.100కు చేరుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే.. అన్ని ధరల మీద దీని ప్రభావం ఉంటుందన్నది మర్చిపోకూడదు. ఓవైపు మహమ్మారి కారణంగావ్యాపారాలు.. ఉద్యోగాలు.. వారు వీరు అన్న తేడా లేకుండా అందరు తెగ ఇబ్బంది పడుతున్న వేళ.. నిత్యవసర వస్తువల మీద ప్రభావం చూపేలా పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా పెరగటం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

లాక్ డౌన్ కారణంగా కేంద్రానికి తగ్గిన ఆదాయ లోటును అధిగమించేందుకు ఈ రీతిలో సామాన్యుల్ని బాదేయటం ఏ మాత్రం సరికాదన్న మాట వినిపిస్తోంది. ఎవరెన్ని అనుకున్నా.. ఎంత గగ్గోలు పెట్టుకున్నా మేం బాదేది బాదేదే అని మోడీ మాష్టారు ఫిక్స్ అయితే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి? మరో నాలుగేళ్లు వెయిట్ చేయటం తప్పించి.

Next Story