వైసీపీ నాయకులకు ఆకలి బాధలు తెలుసా?: పవన్
By న్యూస్‌మీటర్ తెలుగు
ముఖ్యాంశాలు
- ఐదు నెలల్లో లక్షలాది మందిని ప్రభుత్వం రోడ్డుకీడ్చింది: పవన్
- రాజధాని ఎక్కడో ఓ నిర్ణయం తెలపాలి: పవన్ కల్యాణ్
గుంటూరు: ఐదు నెలల కాలంలో లక్షలాది మందిని రోడ్డుకీడ్చి తీవ్ర ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న ఘనత వైసీపీ ప్రభుత్వం సొంతమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎద్దేవా చేవారు. లాంగ్ మార్చ్‌కు రెండు లక్షల మంది వస్తే అందులో అభిమానులు, జనసేన సైనికులు కలిపి వచ్చింది 60 వేల మందే. మిగిలిన వారంతా భవన నిర్మాణ కార్మికులు, వారికి మద్దతుగా వచ్చిన ప్రజలే అంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థమవుతుందన్నారు.
శుక్రవారం మంగళగిరిలోని చిల్లపల్లి కళ్యాణ మండపంలో భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ ఆహార శిబిరాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు. సగటు మనిషికి అండగా నిలబడాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ తెలిపారు. లక్షలాది మంది రోడ్డున పడి, 50 మంది చనిపోతే గానీ వైసీపీ ఇసుక వారోత్సవాలు చేయరా? అంటూ పవన్ ప్రశ్నించారు.
వైసీపీ నేతలకు ఆకలి బాధలు తెలిస్తే వారి విధివిధానాలు ఇలా ఉండవన్నారు. రాజధాని విస్తృతి ఎక్కువ అనిపిస్తే 30 వేల ఎకరాల నుంచి 5 వేల ఎకరాలకు కుదించాలని. ఏదో ఒకటి నిర్ణయించుకొని ప్రజలకు తెలపాలని పవన్ సూచించారు. రాజధానిలో పనులు నిలిచిపోవడం వల్ల వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారన్నారు. కార్మికులకు పనిలేని కాలనికి రూ.10 వేలు, మృతులకు రూ.5లక్షలు ఇవ్వాలని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.