ఆయన తనకు తెలుసున్న పవన్ కళ్యాణ్.. మరణ వార్త తీవ్రంగా కలచి వేసింది..!  

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Aug 2020 8:24 AM IST
ఆయన తనకు తెలుసున్న పవన్ కళ్యాణ్.. మరణ వార్త తీవ్రంగా కలచి వేసింది..!  

కోజికోడ్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై పలువురు స్పందిస్తూ ఉన్నారు. ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఆ విమానాన్ని నడిపిన వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథే వ్యక్తిగతంగా తనకు తెలుసని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దుర్ఘటనలో సాథే మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు.

పైలెట్లతో సహా 17 మంది ప్రయాణికులు కూడా మరణించడం బాధాకరం. గల్ఫ్ నుంచి వచ్చిన వారు మాతృభూమిపై కాలుపెట్టే లోపే మృత్యువు కాటేసింది. మృతి చెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు. దీపక్ వసంత్ సాథే, కెప్టెన్ అఖిలేశ్ కుమార్ విమానయానంలో ఎంతో అనుభవం ఉన్నవాళ్లయినప్పటికీ విమానం ప్రమాదానికి గురికావడం దురదృష్టకరం అని అన్నారు పవన్ కళ్యాణ్.

దీపక్ వసంత్ సాథే ప్రస్థానం:

దీపక్ వసంత్ సాథే గతంలో భారత ఎయిర్ ఫోర్స్ కు పని చేశారు. ఎయిర్ ఇండియా విమానాలు నడిపిన ఆయన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలను నడపడానికి వెళ్లారు. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ పూర్వ విద్యార్థి అయిన ఆయనకు బోయింగ్ 737 విమానాలను నడపడంలో ఎంతో అనువహవం ఉంది.కెప్టెన్ దీపక్ వసంత్ సాథే నేషనల్ డిఫెన్స్ అకాడమీ 58వ కోర్సుకు చెందిన వారని.. జూలియట్ స్క్వాడ్రన్ కు చెందిన వారని ఎయిర్ మార్షల్ భూషణ్ గోఖలే(రిటైర్డ్) తెలిపారు. హైదరాబాద్ లోని ఎయిర్ ఫోర్స్ అకాడెమీలో స్వార్డ్ ఆఫ్ ఆనర్ ను అందుకుని జూన్ 1981 న పట్టాను అందుకున్నారు. ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్ గా కూడా ఆయన విధులు నిర్వర్తించారు. కెప్టెన్ దీపక్ వసంత్ సాథే ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్ బస్ 310ని కూడా నడిపారు. కమర్షియల్ పైలట్ గా ఆయన మారకముందు ఫైటర్ పైలట్ గా విధులు నిర్వర్తించారు.

కెప్టెన్ అఖిలేశ్ కుమార్ బిడ్డను చూడకుండానే:

కెప్టెన్ అఖిలేశ్ కుమార్ బిడ్డను చూడకుండానే ప్రాణాలు వదిలేయడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మథురకి చెందిన అఖిలేష్‌కి మేఘతో 2017లో వివాహం జరిగింది. ఆమె మరి కొద్దిరోజుల్లో ప్రసవించనునున్నారు. కన్నబిడ్డను కళ్లారా చూసుకోకుండానే అఖిలేష్ మృతి చెందడం ఆ కుటుంబాన్ని, సన్నిహితులను తీవ్ర విషాదంలో ముంచింది. అఖిలేష్‌కు ఇద్దరు తమ్ముళ్లు, ఒక సోదరి, తల్లిదండ్రులు ఉన్నారు. లాక్‌డౌన్‌కి ముందు ఒకసారి అఖిలేష్ మథురకి వచ్చి వెళ్లారు. 2017 నుంచి ఆయన ఎయిర్ ఇండియా సంస్థతో పనిచేస్తున్నారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా మేలో ప్రారంభించిన కోళీకోడ్-దుబాయ్-కోళీకోడ్ ఎయిర్ ఇండియా విమానానికి మొదటి అధికారిగా ఆయన్నే నియమించారు. నిజాయితీ పనిచేస్తాడని,టెక్నికల్ విషయాలను అర్థం చేసుకోవడంలో ఇతర పైలట్లకు సహాయం చేసేవారని ఆయన సన్నిహితులు, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్లు గుర్తుచేసుకున్నారు.

Next Story