చంద్రబాబు ట్రాప్‌లో పవన్:మంత్రి అవంతి విమర్శలు
By న్యూస్‌మీటర్ తెలుగు
ముఖ్యాంశాలు
- టీడీపీతో పవన్ కలిస్తే మాకు అభ్యంతరం లేదు: అవంతి
- పవన్ ఎవరికోసం జనసేన పార్టీ పెట్టారు ?: మంత్రి అవంతి
- పవన్‌కల్యాణ్‌కంటూ ఓ పాలసీనే లేదు: వైసీపీ నేత అంబటి
విశాఖ: భవన నిర్మాణ కార్మికులకు అండగా లాంగ్‌మార్చ్ చేపట్టిన పవన్‌కల్యాణ్‌పై మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ట్రాప్‌లో పవన్ పడ్డారని.. అందుకే ఎన్నికల్లో ప్రజలు పవన్‌ను తిరస్కరించారన్నారు. నిన్న సభలో పవన్ మాట్లాడిన వ్యాఖ్యలు అభ్యంతరకంగా ఉన్నాయన్నారు. పవన్ ఇంకా సినిమా భ్రమలోనే ఉన్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. పవన్ వ్యాఖ్యల ద్వారా అతని అజ్ఞానం, అపరిపక్వత కనిపిస్తోందన్నారు. టీడీపీతో పవన్ కలిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. చంద్రబాబుతో పవన్‌తో చీకటి ఒప్పందం ఉందని మంత్రి అవంతి ఆరోపించారు. టీడీపీతో పవన్‌కు లాలూచీ ఉందనే ప్రజలు జనసేనను ఓడించారు. పవన్ కల్యాణ్ అజ్ఞాత వాసి కాదు.. అజ్ఞాన వాసి అని అన్నారు. పొత్తులు లేకుండా చంద్రబాబు ఎప్పుడైనా గెలిచారా? అని మంత్రి అవంతి ప్రశ్నించారు. రెండు కిలోమీటర్లు నడవలేని పవన్‌కు సీఎం జగన్‌పై మాట్లాడే అర్హతలేదన్నారు. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు లేకుండా పవన్ సభ పెట్టలేరా?. పవన్ ఎవరి కోసం జనసేన పార్టీ పెట్టారో చెప్పాలన్నారు. చంద్రబాబు జీవితమంతా వెన్నుపోటు రాజకీయాలేనని మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు ఎజెండాను మోయడమే పవన్ పాలసీ: అంబటి
విశాఖలో పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ చేశారు.. కానీ అందులో భవన నిర్మాణ కార్మికులు కనిపించలేదని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. లాంగ్‌మార్చ్‌లో జనసేన జెండాలు పట్టుకున్న టీడీపీ కార్యకర్తలు కనిపించారన్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసమే లాంగ్ మార్చ్ పెట్టారా? బాబుపై వచ్చిన విమర్శలకు సమాధానం కోసం లాంగ్ మార్చ్ పెట్టారా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. అసలు మీటింగ్ ఎందుకు పెట్టారో అర్థంకావడం లేదన్నారు. పనికి వచ్చే మాట ఒక్కటీ లేదని.. వ్యక్తిగత దాడులు చేసే ప్రయత్నం చేశారని అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీ, జనసేన పార్టీ డీఎన్‌ఏలు ఒక్కేటనన్నారు. చంద్రబాబు ఎజెండాను మోయడమే పవన్ పాలసీ అని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై అవాకులు చెవాకులు పేల్చడం మంచిదికాదన్నారు.
విశాఖ: ఇసుక దొరకటం లేదని, పెదల ఉపాధి పోయిందని చేసిన లాంగ్‌మార్చ్ అసలు రంగు స్టేజి మీద ఉపన్యాసాల్లో తెలిపోయిందన్నారు వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు. కేవలం సీఎం మీద, విజయసాయి మీద వ్యక్తిగత విమర్శలు చేయడానికి సరిపోయిందన్నారు. విజ్ఞత లేని ఉపన్యాసం చేశారు. ఎవరి దున్ను చూసుకొని బెదిరిస్తున్నారని ద్రోణంరాజు శ్రీనివాసరావు మండిపడ్డారు. సీఎంకు విపక్ష నేత హోదాలో సలహా ఇవ్వాలి. కానీ దూషిస్తే ఎలా?.. ఎన్నుకున్న ప్రజలను అవమానించేలా మాట్లాడటం తగదన్నారు. ఇసుక కొరత తీరుతుంది. ఐదేళ్ల సుస్థిర పాలనతో మరో ప్రజాభిమానంతో అధికారంలోకి వస్తామని ద్రోణంరాజు అన్నారు.