ఐపీఎల్ స్పాన్సర్ షిప్ బరిలో దిగిన పతంజలి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Aug 2020 12:01 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న వివో.. ఈ ఏడాది ఐపీఎల్ స్పాన్సర్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివోతో ఐపీఎల్ కు ఐదేళ్ల కాంట్రాక్టు ఉంది. ఇందుకోసం వివో ఏడాదికి రూ.440 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఒప్పందం 2022లో ముగియనుంది. ప్రస్తుతం భారత్-చైనా మధ్య ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది టైటిల్ స్పాన్సర్ షిప్ నుండి వివో సంస్థ వైదొలిగింది. బీసీసీఐ ఈ ఏడాది కొత్త స్పాన్సర్ కోసం ఎదురుచూస్తోంది.
బాబా రామ్ దేవ్ కు చెందిన పతంజలి సంస్థ కూడా ఈ ఏడాది టైటిల్ స్పాన్సర్ షిప్ ను సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. 'ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం మేము ప్రయత్నాలు మొదలుపెట్టాము. పతంజలి సంస్థను గ్లోబల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ లోకి తీసుకుని వెళ్లాలని భావిస్తున్నాము' అని పతంజలి సంస్థ ప్రతినిధి ఎస్కే తిజారవాలా తెలిపారు. తాము భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ఓ ప్రపోజల్ కూడా పంపుతున్నట్లు ఆయన తెలిపారు.
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ గా పతంజలి వస్తే.. అది పతంజలి సంస్థకు ఎంతో మంచి చేస్తుందని బ్రాండ్ అనలిస్టులు చెబుతూ ఉన్నారు. పతంజలి సంస్థ మరింత పాపులాట అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇప్పటికే భారతదేశంలో చైనాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో స్వదేశీ సంస్థ అయిన పతంజలి ఐపీఎల్ టైటిల్ ను స్పాన్సర్ షిప్ చేస్తే ఆ సంస్థకు ఎంతో ప్లస్ గా మారుతుందని బ్రాండ్ స్ట్రాటజిస్టులు తెలిపారు.
వివో సంస్థ తప్పుకోవడంతో పలు బడా కంపెనీలు ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం బరిలోకి దిగాయి. జియో, అమెజాన్, టాటా గ్రూప్, డ్రీమ్ 11, అదానీ గ్రూప్, కోకాకోలా, బైజూస్ సంస్థల పేర్లు బాగా వినిపిస్తూ ఉన్నాయి.