కొండలెక్కిన కవలలు..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 24 Aug 2020 10:44 AM GMTచెట్టులెక్కగలవా.. పుట్టలెక్కగలవా.. అన్నట్టే కొండలెక్కగలరా? అని ఆ కవలల్ని అడిగారనుకోండి దాందేముంది ఎక్కేస్తాం అన్న సమాధానం వేగంగా వస్తుంది. కేవలం మాటలు కాదు చేతల్లోనూ తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు ఆ కవలలు. తాషి, నుంగ్షి మాలిక్‌లు అత్యంత ఎత్తయిన ఏడు శిఖరాలను అధిరోహించి గ్రాండ్‌స్లామ్ సాధించారు. ప్రపంచంలోనే ఇలాంటి ఘనత సాధించిన తొలి మహిళా కవలలుగా రికార్డులకెక్కారు.
రిటైర్డ్ కల్నల్ వీఎస్ మాలిక్ బొమ్మరిల్లు ఫాదర్‌లా పిల్లలపై విచిత్రమైన ఒత్తిడి తెచ్చే రకం కాదు. ఎప్పుడూ తన పిల్లల్ని చదువుకోవాలని , ఇంకేదో చేయాలని కోరేవాడు కాదు. ఇంటర్‌లో ఇద్దరూ 90శాతం మార్కులు సాధించినా దూరవిద్యలో చదువుకుంటూ అదనంగా ఏదైనా నేర్చుకోవాల్సిందిగా సూచించాడు. దీంతో వారు జర్నలిజం అండ్ మాస్‌కమ్యూనికేషన్ కోర్సు చదివారు. అంతేకాదు రచన,నృత్యం నేర్చుకు న్నారు.
2009లో వారి జీవితం అనుకోని మలుపు తిరిగింది. ఈ మలుపు తిప్పింది వారి తండ్రే. వీఎస్ మాలిక్ ఇద్దరు కూతుళ్ళను ఉత్తర కాశీలోని నెహ్రూ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేర్పించాడు. మొదట్లో శిక్షణ చాలా కష్టమనిపించింది. అయినా వారు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. కోచింగ్ ఇచ్చేవారు కూడా ఈ కవలల మనోధైర్యానికి, పట్టుదలకు ముచ్చటపడి బాగా తర్పీదునిచ్చారు. ఏదో ఒక రోజు మీరిద్దరూ తప్పకుండా ఎవరెస్ట్ అధిరోహిస్తారని కోచ్ అనేవారు. వారిని ట్విన్ ఎవరెస్ట్ అని అభిమానంతో పిలిచేవారు. శిక్షణలో ఏ గ్రేడ్ సాధించి బైటికొచ్చారు. తాపి, నుంగ్లీలు ఇన్‌స్ట్రక్టర్ గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు. ముప్పైమంది శిక్షణార్థుల్లో కేవలం ముగ్గురికే ఈ అవకాశం దక్కింది.
2010లో ఎవరెస్ట్ అధిరోహించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఇది అంత సులువు కాదు. నిరంతరం పోరాడాలి. ఒక్కో స్థాయిని అధిగమించాలి. వీరిద్దరు గట్టి సంకల్పబలంతో 2013లో ఎవరెస్ట్ ఎక్కారు. అయితే అదే వారి అంతిమ లక్ష్యం కాదు. అది ప్రారంభం మాత్రమే! గ్రాండ్‌స్లామ్ సాధించాలన్న కొత్త కోరిక పుట్టింది. ఏడు ఖండాల్లో ఎత్తయిన శిఖరాలన్నిటినీ అధిరోహించే వారినే గ్రాండ్‌స్లామ్‌గా పిలుస్తారు. తమతోపాటు పర్వతారోహకుల మనసులో ఎవరెస్ట్ ఎక్కితే చాలు గ్రాండ్‌స్లామ్ సాధించినట్టే అనుకున్నారు.
ఎందుకంటే అన్ని పర్వతాల కంటే ఎవరెస్టే ఎత్తయినది.. కష్టమైనది కూడా. 26వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ శిఖరాన్ని ఎక్కేటపుడు ఏ క్షణంలోనైనా ప్రమాదాలు సంభవించవచ్చు. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన వారు కోకొల్లలు. అందుకే ఈ శిఖరాన్ని డెత్‌జోన్ అంటారు. తాపి, నుంగ్షీలు అప్పటికే కిలిమంజారో పర్వతానెక్కారు. రెండోదిగా ఎవరెస్ట్ అధిరోహించాలని నిర్ణయించుకున్నారు. ఈ పర్వతాన్ని ఎక్కగలిగితే ఏడు పర్వతాలు సులువుగా ఎక్కవచ్చని వారి ఆలోచన. వారి ప్రయత్నం 2013లో ఫలించింది. ఆ సంవత్సరంలోనే వారు ఎవరెస్ట్ ఎక్కారు.
ఎవరెస్ట్ ఎక్కేశాం.. ఇక మాకు ఎదురేముంది అని వారు అనుకోలేదు. వెంటనే వారి దృష్టి అంటార్కిటికాలోని విన్సన్ మాసిఫ్ పర్వతంపై పడింది. అక్కడ 7–14 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. దాదాపు 22 రోజుల పాటు చుర్రుమనే వెలుగు, ప్రమాదభరితంగా మంచు నదులుంటయి. తాపి, నుంగ్షీలు ఈ పర్వతం ఎక్కడానికి చాలా శ్రమించారు. అయినా 2014లో 18 రోజుల్లో ఎక్కి మరోసారి తమ సత్తా ఏంటో చూపించుకున్నారు. ఆఫ్రికాలోని టాంజానియాలో 5895 అడుగుల ఎత్తున్న కిలిమంజారరో పర్వతాన్ని అధిరోహించడంతో వీరి గ్రాండ్‌స్లామ్ లక్ష్యం పూర్తయింది.
శిఖరాలు ఎక్కేటపుడు సాధారణంగా బరువు కోల్పోతారు. వీరిద్దరూ కూడా దాదాపు 12 కిలోల బరువు తగ్గారు. వెంటవెంటనే పర్వతాలు ఎక్కాల్సి రావడంతో శక్తి కోసం స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఏరోబిక్స్ చేశారు. అన్నిటికీ మించి వారి నాన్న డైట్ విషయంలో తనే పర్యవేక్షించేవారు. ఈ విజయంలో మా శ్రమ ఎంతుందో.. నాన్నగారి ప్రోత్సాహం అంతే ఉంది. ఆయన మాకు తోడు లేకుంటే ఈ సాహసం చేసి ఉండేవాళ్ళం కాదని తాపి నుంగ్షీలు ముక్తకంఠంతో తెలిపారు. ఏడు పర్వతాలు అధిరోహించిన శక్తిమంతమైన మహిళా కవలలుగా గిన్నీస్ బుక్ ఎక్కారు. అంతేకాదు రాష్ట్రపతి చేతుల మీదుగా నారీశక్తి పురస్కారం అందుకున్నారు.
వీరిద్దరిని చూశాక సంకల్ప బలం.. సాధన ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదనిపిస్తుంది.