ప‌ల్ల‌వించిన‌ పట్టు చీర..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  24 Aug 2020 7:01 AM GMT
ప‌ల్ల‌వించిన‌ పట్టు చీర..!

బామ్మ మాట బంగారు బాట అన్నట్టుగానే, పల్లవి మొహదీకర్‌ పట్వారీకి తాతా మాట.. పట్టు చీర బాట అయింది. పల్లవి చిన్నప్పటి నుంచి తాతా చీర నేస్తుంటే వింతగా చూస్తుండేది. తన బాల్యం తాత వద్దే సాగింది. సరదాగా తనూ మగ్గం ఆడిస్తానంటే తాతయ్య వద్దులేమ్మా ఈ కష్టం నాతోనే ఆగిపోనీ అంటుంటే పల్లవికి అర్థమయ్యేది కాదు. పట్టు దారం మగ్గం పై చీరగా ఎలా ప్రాణం పోసుకునేదో దగ్గరుండి చూసిన ప్రభావమేమో పల్లవికి పట్టుచీరలన్నా.. వాటిని తయరు చేయడమన్నా భలే ఆసక్తిగా ఉండేది. చిన్నప్పుడు తాతా వారింపు మాట అంతగా అర్థం కాకపోయినా, పెరుగుతున్న కొద్దీ ఆ మాటల వెనక గూడుకట్టుకున్న ఆవేదన పల్లవికి తెలిసొచ్చింది. రంగు రంగు దారాలను చీరగా మలచడం వెనక చేనేత కార్మికుల కష్టాలేంటో తెలిసొచ్చింది. వయసు వస్తున్న కొద్దీ చేనేతల వెతలు చూస్తున్న కొద్దీ.. వీరి సృజనకు సరైన గుర్గింపు సరైన ఆదాయం రావట్లేదని పల్లవికి చాలా బాగా అర్థమైంది.

ఆలోచనలు భావాలు చీరచుట్టే తిరుగుతున్నా.. అమ్మానాన్నల ఆకాంక్షలు తీర్చాలన్నా.. తాను ఎదగాలన్నా నిలబడాలన్నా చదువు చాలా ముఖ్యమని పల్లవికి బాగా తెలుసు. అందుకే కుటుంబం పూణేకి మారాక చదువుపై దృష్టి నిలిపింది. అమ్మానాన్నలు ఉద్యోగం చేసేవారు. చదువుల్లో అగ్రస్థానంలో ఉన్న పల్లవి ఇంజనీరింగ్‌ పూర్తి చేసింది. వెంటనే టాటా అయితే పట్టు చీర కల ఓ పట్టాన ఆమెను వదలట్లేదు. వెంటాడే ఆ అందమైన కలకు పల్లవి బానిస అయింది. అమ్మానాన్నల ముందు తను చేనేత కళాత్మక రంగంలో వెళ్ళాలనుకుంటున్నానని చెబితే వారు కోప్పడ్డారు.

ఏ చేనేతైతే తమ బతుకుల్ని తారుమారు చేసిందో.. మళ్ళీ అదే దారిలో వెళతానన్న కూతురిని మందలించాల్సిన పరిస్థితి తలెత్తింది. అందుకే వారు పిచ్చి ఆలోచనలు మానుకో ఇంజనీరింగ్‌ చదువు చదివింది చివరికి చీరలమ్ముకోడానికా.. మంచి ఉద్యోగంలో స్థిరపడ్డం మానేసి ఇదేంటి ఇలా అని గట్టిగా కేకలేశారు. పల్లవి వారి మాటకు ఎదురు చెప్పలేదు.. అలాగే తన మనసుకు కూడా! అందుకే మరి కొన్ని నెలల్లోనే ఆ ఉద్యోగం మానేసి లఖ్‌నవూలో ఎంబీయే కోర్సులో చేరింది. అమ్మానాన్నలు పర్వాలేదులే దారికొస్తోంది అనుకున్నారు. కానీ పల్లవి ఆలోచనలు వేరు. చేనేత రంగంలో వెళ్ళక ముందే వాణిజ్య రంగం అనుపానులు తెలుసుకోవాలి. అందుకు ఎంబీయే ఉపయోగపడుతుందని భావించే ఆ కోర్సులో చేరింది.

P1

ఎంబీయే ముగించాక ఓ ప్రైవేటు సంస్థలో చేరింది. పైసా పైసా ఖర్చు చేయకుండా కూడబెట్టింది. దాదాపు రూ.3 లక్షలు కాగానే ఆ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పింది. ఇక తనన కలల ప్రపంచాన్ని సాకారం చేసుకునే దిశగా అడుగులేసింది. 2017లో కారాగిరి అనే సంస్థను ప్రారంభించింది. తను వ్యాపారవేత్తగా రాణించడమే కాదు.. చేనేత కార్మికుల బతుకుల్లో వెలుగులు తేవాలన్నది ఆమె దృఢ సంకల్పం.

అందుకే మహారాష్ట్రలోని ప్రతి చేనేత పల్లె పల్లెకూ తిరిగింది. ప్రయత్నం ఫలించింది. అయిదుగురు చేనేత కళాకారులు జతకట్టారు. వారితో మొదట మరాఠీలు ప్రత్యేక సందర్భాల్లో ధరించే 40 నారాయణ పేట చీరలు నేయించింది. పేరుకు సంస్థ గానీ మౌలిక వసతులు లేవు. ప్రత్యేక ఆఫీసు పెట్టుకునే స్తోమత లేదు. అందుకే ఇంట్లోని ఓ చిన్న గదినే మార్కెట్‌ ఆఫీసుగా మార్చుకుంది. 40 చీరలకు గానూ 30 అమ్మగలిగింది. కాస్త నమ్మకం కలిగింది. తాన కలలు నిజమయ్యే దారులు కనిపిస్తున్నాయి అనుకుంది పల్లవి.

కొత్త బ్రాండ్‌ ఉంటే మార్కెటింగ్‌ మరింత సులువవుతుందని భావించి నాసిక్‌ చీరల తయారీకి పూనుకుంది. అలాగని మొదట ప్రారంభించిన నారాయణపేట్‌ చీరల తయారీ మానుకోలేదు. వాటికి నాసిక్‌ బ్రాండ్‌ అదనంగా చేర్చింది. చేనేత కళాకారుల సంఖ్య 75కు పెంచింది. నాసిక్‌ చీరలు రూపుదిద్దుకున్నాయి. అమ్మకానికి ఆన్‌లైనే మేలని ఆ దిశగా తన వ్యాపార పంథాను మార్చింది పల్లవి. డోర్‌డెలివరీ పద్ధతి ప్రారంభించాక ఆర్డర్లు పెరిగాయి. పనీ పెరిగింది. మూడేళ్లపాటు క్షణం తీరిక లేకుండా చీరల ప్రపంచంలో మునిగి తేలింది పల్లవి. ఈ మూడేళ్ళలో కారాగిరి కుటుంబం కూడా బాగా పెద్దదయ్యింది. ప్రస్తుతం 150 యూనిట్లలో దాదాపు 1500 మంది చేనేత కళాకారులు శ్రమిస్తున్నారు. వారి జీవితాల్లోనూ వెలుగులు పరచుకుంటున్నాయి.

P2

వ్యాపారాభివృద్దికి పల్లవి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని చేనేత కళాకారుల వివరాలు సేకరించి వారినీ తమ కుటుంబంలో చేర్చుకోవడం మొదలెట్టింది. గతేడాది 50 వేల చీరలు మార్కెటింగ్‌ చేశారు. ఈ కరోనా సమయంలోనూ ఆర్డర్లు వస్తున్నాయంటే.. కారాగిరి సంస్థ గుడ్‌విల్‌ ఎంతగా విస్తరించిందో అర్థమవుతుంది. ఈ సంస్థ చేనేతలు ప్రతి రోజూ లక్ష చీరలు నేస్తున్నారు. కరోనా సమయంలో ఎన్నో వ్యాపార సంస్థలు మూసేయడంతో ఉద్యోగులు వీధిన పడటం మనం చూస్తున్నాం.

కానీ కారాగిరి సంస్థ మాత్రం సజావుగా తన పని తాను చేసుకు పోతోందంటే.. మేనేజ్‌మెంట్‌ పటిష్టంగా ఉందనేగా అర్థం. మూడు లక్షల రూపాయాలతో ప్రారంభించిన సంస్థ టర్నోవర్‌ ప్రస్తుతం యాభై కోట్లకు చేరుకుంది. తన కలల సాకారం చేసుకునే ఈ సుదీర్ఘ ప్రయాణంలో అమోల్‌ పట్వారీ జీవిత భాగస్వామి అయ్యారు. ఆర్థోపెడిక్‌ సర్జన్‌ అయిన అమోల్‌ తన భార్య వ్యాపారానికి చేతనైనంత సహకారం అందిస్తున్నారు. మొదట్లో ఈ పని ఎందుకూ అన్న పల్లవి అమ్మానాన్నలు తమ కూతురు అంచెలంచెలుగా ఎదిగిన తీరును చూసి ముచ్చట పడటమే కాదు గర్వపడుతున్నారు కూడా!

Next Story