ఆమె అంతరంగమే ఓ అంతరిక్షం..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  23 Aug 2020 2:22 PM GMT
ఆమె అంతరంగమే ఓ అంతరిక్షం..!

సాధారణంగా వయసు పై బడుతున్న కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి.. ఉత్సాహం సన్నగిల్లుతుంటుంది. మొదట్లో చేసిన పనే ఎన్నాళ్లనీ అనే విసుగుతో మొదలయ్యే ఈ జబ్బు కొన్నాళ్ళకు ఉద్యోగంలో పనులు తగ్గితే బావుణ్ణు అనిపించే దశకు చేరుకుంటుంది. యాౖభై ఏళ్ళకే ఇక పనిచేయడం వల్ల కాదంటూ వలంటరీ రిటైర్‌ అయ్యేవాళ్ళకు లేక్కే లేదు. అలాగే యాభైకి దగ్గరపడేవాళ్లను పక్కన పెట్టేసే యాజమాన్యాలు లేకపోలేదు. కానీ వీటికి భిన్నంగా స్యూ ఫిన్లే ఎనభైరెండేళ్ళ వయసులోనూ తరగని ఉత్సాహంతో చెదరని చిరునవ్వుతో నాసాలో ఉద్యోగం చేస్తోంది. మంచాన పడాల్సిన వయసులో అంతరిక్ష లెక్కలు తేలుస్తూ ఔరా అనిపించుకుంటోంది.

మానవ కంప్యూటర్‌గా పేరుతెచ్చుకున్న స్యూ ఫిన్లే గత అరవై ఏళ్లుగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో కొలువు చేస్తోంది. సుదీర్ఘంగా నాసాలో ఉద్యోగిగా కొనసాగుతున్న ఫిన్లే జీవితం చాలా మందిచి స్ఫూర్తి దాయకం. నాసాలో అరవై ఏళ్ళ కొలువు పూర్తి చేసుకున్న ఈ మానవ కంప్యూటర్‌ ‘లెక్కల్తో ముడివడి ఉన్న ఉద్యోగం చేయాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు’ అంటారు. ఈ సంస్థలో సుదీర్ఘకాలం పనిచేసిన తొలి మహిళగా ఆమె రికార్డుకెక్కారు.

స్యూ ఫిన్లేకు మొదట్లో గొప్ప ఆర్టిటెక్ట్‌ కావాలని ఉండేది. కాలిఫోర్నియాలోని స్కిప్స్‌ కాలేజీలో ఆర్ట్స్‌ అండ్‌ ఆర్టిటెక్చర్‌ కోర్సులో చేరారు. ఆర్ట్స్‌ విభాగం కాస్త గందరగోళం అనిపించే సరికి వదిలేశారు. ఫిన్లేకు చిన్ననాటి నుంచే గణితం అంటే చెప్పలేనంత ఇష్టం. తన హైస్కూల్‌ రోజుల్లో మిగిలిన విద్యార్థుల కంటే వేగంగా కెమికల్‌ ఈక్వేషన్లు సాధించి బహుమతులు కూడా గెల్చుకుంది. ఇలా కాదు ఇంజనీరింగే తనకు అన్నివిధాల సరైనది అనిపించింది.

ఆ నిర్ణయమే ఆమె జీవితంలో మంచి మలుపునకు కారణమైంది. ఓ ఇంజనీరింగ్‌ కంపెనీలో టైపిస్టు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో క్లిష్టమైన లెక్కలు చేసేవారికి కంప్యూటర్లు అని పిలుచుకునేవారు. చాలా కంపెనీలు ఇలాంటి కంప్యూటర్లను నియమించుకునేవి. ఫిన్లే దరఖాస్తు చేసుకున్నది అలాంటి మానవ కంప్యూటర్లనే నియామకం చేసే కంపెనీకే. ఇంటర్వ్యూలో నీకు లెక్కలంటే ఇష్టమా అని అడిగారు. నాకు అక్షరాల కంటే అంకెలంటేనే చాలా ఇష్టమని బదులివ్వడంతో ఆ ఉద్యోగం వచ్చింది. ఒక పెద్ద ఫ్రిడెన్‌ కంప్యూటర్‌ మీద తను మరో మహిళ పనిచేసేవారు. ఇంజనీర్లు అడిగిన గణాంకాలు అందివ్వడమే ఫిన్లే ఉద్యోగం.

అయితే ఇష్టంతో చేరిన ఆ కొలువులో ఎక్కువ కాలం ఉండలేకపోయింది. కారణం ఆమెకు పెళ్ళి కావడమే. భర్త పీటర్‌ ఫినాలే కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చదువుకున్నారు. ఆ సంస్థ నాసా తరఫున జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరెటరీని నిర్వహిస్తోంది. వారు నివసిస్తున్న ప్రాంతంలోని కొండల మధ్య కాలెక్ట్‌ విద్యార్థులు, రాకెట్‌ రంగానికి చెందిన వారు ఓ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఇది గమనించిన పీటర్‌ సూచన మేరకు ఫిన్లే ఉద్యోగానికి అప్లై చేసింది. ఆ ఉద్యోగం వచ్చింది. అమెరికా సైన్యం ఆ సంస్థకు నిధులు సమకూర్చేది. అప్పట్లో నాసా ఇంకా ఏర్పాటు చేయలేదు. అమెరికా 1958లో తొలిసారిగా శాటిలైట్‌ ఎక్స్‌ప్లోరర్‌–1 ను ప్రయోగించింది. అప్పట్నుంచి అదే ఆమె ఇల్లయింది. అరవై ఏళ్ళ దాకా అక్కడే ఉద్యోగం చేస్తోంది.

స్యూ ఫిన్లేకు ఇద్దరు పిల్లలు పుట్టడంతో మూడేళ్లపాటు ఇంటికే పరిమితం కావల్సి వచ్చింది. అలా ఇంటికే పరిమితం కావడం ఆమెకు నరకమనిపించింది. మానసికంగా డిప్రెషన్‌ వచ్చిందేమో అన్న అనుమానమూ తలెత్తింది. ఇక చేసేది లేక ఓ సైకియాట్రిస్ట్‌ను కలిసింది. ఆయన అన్ని పరీక్షలు చేశాక.. మళ్ళీ ఉద్యోగంలో చేరమే సరైన మందు అని తేల్చి చెప్పారు. 1970లో భర్తతో కలిసి ఉండలేక విడాకులు తీసుకున్న స్యూ పూర్తిగా ఉద్యోగానికే అంకితమై పోయారు. ఆమె ఇద్దరు పిల్లలు కూడా కంప్యూటర్‌ సంబంధిత రంగంలోనే ఉన్నారు.

తనకు వచ్చిన అనుమానాలను నివృత్తి చేసుకోడానికే ఉద్యోగం చేస్తున్నానంటున్న ఫిన్లేను ఎప్పుడు రిటైర్‌ అవుతరాని అడిగితే...చేస్తున్న పనిని ఆస్వాదిస్తున్నా...నాకలాంటి ఆలోచనలే రావు. నేను పని చేస్తునే ఉంటాను. అయినా ఇంట్లో నేను చేయదగ్గ పనేది నాకు కనిపించడం లేదు అంటూ చమత్కారంగా సమాధా నమిస్తుంది. స్యూ ఫిన్లేకు లెక్కలొక్కటే కాదు.. కథలు,నవలలు అన్నా, సంగీతమన్నా చాలా ఇష్టం. ఫిన్లే రచయిత్రి కూడా. నాసా చేపట్టిన వివిధ ప్రాజెక్టులపై పుస్తకాలు రాశారు. సంగీతంలో సింఫనీ, బ్యాలేలను ఇష్టపడతారు. అప్పుడుప్పుడు మాత్రం నా మనవళ్ళను చూడ్డానికి సెయింట్‌ లూయిస్‌కు వెళుతుంటాను అంటున్న స్యూ ఫిన్లే అంకితభావానికి, ఉద్యోగాన్ని తన వ్యక్తిత్వంగా భావించే గొప్ప పనిమంతురాలు.

Next Story