కన్నీటి తడి ఆరని చీకటి బతుకులు..

By మధుసూదనరావు రామదుర్గం  Published on  23 Aug 2020 1:26 PM GMT
కన్నీటి తడి ఆరని చీకటి బతుకులు..

‘మామూలుగానే మేం రోజూ చస్తూ.. నోళ్ళు మూసుకుని బతుకుతుంటాం. ఈ కరోనా మమ్మలి మరింత చావగొట్టింది. సర్కార్‌ దృష్టిలో లాక్‌డౌన్‌ కత ముగిసినట్లే కానీ మా జీవితాలు ఇంకా లాక్‌డౌన్‌లోనే ఉంటున్నాయి. మంచి రోజులు ఎప్పుడొస్తాయో.. అసలు వస్తాయో రావో అని జీవచ్ఛవాల్లా బతుకుతున్నాం’

సెక్స్‌వర్కర్లను ఎవరిని కదిపినా వారి నోటినుంచి వచ్చే మాటలివి. వశ్లమ్ముకోవడం తప్పించి మరో దారి లేదని సెక్స్‌వర్కర్లుగా మారిన వీరి జీవితం కరోనా వేళ మరింత ఘోరంగా మారిపోయింది. అసలు వీరంటూ మన సమాజంలో ఉన్నారన్న విషయం కూడా చాలా మంది దృష్టికి రావట్లేదు. అసలే అవి చీకటి బతుకులు.. ఇప్పుడు మరింత చీకటికూపంలా మారుతున్నాయి.

గత అయిదు నెలల కాలంలో కరోనా దెబ్బతో ఉపాధి ఎగిరిపోయిన చాలామంది వలస కూలీలు సొంతూళ్ళకు కాలినడకన వెళ్ళిన ఘోర దృశ్యాలు ఎన్నో సచిత్రాలుగా మన కళ్ళకు కట్టాయి. అయితే అసంఘ టిత జీవులుగా మిగిలి పోయిన సెక్స్‌ వర్కర్ల జీవనం మరింత దుర్భరంగా మారిపోయాయి. నలుగురి ఎదుట తమ దుస్థితి ఇది అని చెప్పుకోలేని చీకటి కూపంలో కుంగి కృశించి పోతున్నారు. ఏ తల్లిదండ్రులను కాపాడుకో డానికి, ఏ పిల్లల్ని కాపాడుకోడానికి సెక్స్‌ వర్కర్ల అవతారమెత్తారో...వారి బతుకులే చిద్రం కావడాన్ని వీరు సహించలేక పోతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో అందరికీ సాయం అంతో ఇంతో అందింది. అది సర్కార్‌ నుంచి కావచ్చు.. లేదా స్వచ్ఛంద సంస్థల నుంచి కావచ్చు. కానీ ఎలాంటి సాయం అందని వర్గమంటూ ఏదైనా ఉందా అంటే ఈ సెక్స్‌వర్కర్ల సమూహం మాత్రమే. దయతలచి ఒకరిద్దరు ముందుకు వచ్చినా.. ఆ సాయం అందుకునే వారి సంఖ్య వేళ్ళపై లెక్కపెట్టవచ్చు.

2016 అన్‌ఎయిడ్స్‌ నివేదిక ప్రకారం మన దేశంలో దాదాపు 6.58 లక్షల మంది సెక్స్‌ వర్కర్లు న్నారు. అయితే నాకో (నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌) ప్రకారం 2009 లోనే ఈ సంఖ్య 8లక్షల పైమాటే! దేశంలో వ్యభిచారం నడిపేవారు, ఇళ్ళల్లోనే కార్యకలాపాలు సాగిస్తున్న సెక్స్‌వర్కర్లు వివధ రకాలుగా వ్యభిచార వృత్తిని చేపట్టిన వారు దాదాపు 3 మిలియన్లలో ఉంటారని ఓ అంచనా! 2014లో ప్రచురించిన ఎ స్టడీ ఆఫ్‌ సెక్స్‌వర్క్‌ ప్రకారం 14 రాష్ట్రాల్లో 50 శాతం సెక్స్‌వర్కర్లు గతంలో ఇళ్లల్లో పనిమనుసులుగానో, గృహనిర్మాణాల్లో కూలీలుగానో, దినసరి కూలీల్లాగో పనిచేసినవారే. వీరిలో 30 శాతం మంది ఇప్పటికీ తమ మామూలు పనులతో పాటు ఈ సెక్స్‌వర్క్‌ కూడా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

సామాజిక బహిష్కర ణే సెక్స్‌ వర్కర్ల పాలిట పెద్ద శాపమనుకుంటుంటే.. పులి మీద పుట్రలా ఈ కరోనా వచ్చి పడటతో అనుకోని ఇబ్బందులు ఇక్కట్లు దారుణంగా చుట్టుముట్టి వారి బతుకుల్ని మరింతగా అతలాకుతలం చేసేస్తున్నాయి. ఈ చీకటి బతుకుల్లో తొంగి చూస్తే దారుణ వాస్తవాలు కళ్ళకు కనిపిస్తాయి. వీరికి దైనందిన జీవనం గడపడం కష్టసాధ్యమవుతోంది.

లైఫ్‌ బియాండ్‌ నంబర్‌ వెబ్‌సైట్‌ ప్రతినిధులతో ఆల్‌ఇండియా నెట్‌వర్క్‌ సెక్స్‌ వర్కర్స్‌ ప్రెసిడెంట్‌ కుసుమ్, కమ్యూనిటీ బేస్డ్‌ ఆర్గనైజేషన్‌, సర్వోదయ సమితి కార్యదర్శి సుల్తానా బేగమ్‌లు తమ చేదు అనుభవాలను పంచుకున్నారు. ఢిల్లీ జిబి రోడ్, రాజస్థాన్‌లోని అజ్మీర్‌ ప్రాంతంలో సెక్స్‌వర్కర్లు ఎదుర్కొంటు న్న కష్టాలను ఏకరువు పెట్టారు. ఢిల్లీ జీబీ రోడ్‌ ప్రాంతంలో దాదాపు 5వేల మంది సెక్స్‌ వర్కర్లున్నారు. లాక్‌ డౌన్‌ మొదట్లో కొద్ది కాలం వరకే ఉంటుందని భావించినా.. కరోనా అంతకంతకు రెచ్చిపోతుండటంతో పొడిగింపు అనివార్యమైంది. ఇది చాలా అనూహ్య పరిణామం.

ఈ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోడానికి ఏమాత్రం సిద్ధంగాలేని సెక్స్‌ వర్కర్లు చాలా కష్టనష్టాలను చూడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఢిల్లీ జీబీ రోడ్‌ లోని సెక్స్‌వర్కర్ల బతుకులు నరకంగా మారిపోయాయి. బ్రోతల్‌ హౌస్‌లో ఉంటున్నవారే కాదు అద్దె ఇళ్ళల్లో ఉంటున్న సెక్స్‌వర్కర్లు కూడా తమ దినసరి ఖర్చులక్కూడా డబ్బులు లేక అల్లాడుతున్నారు. ఇళ్ళ అద్దె కట్టలేక ...ఈ స్థితిలో ఇల్లు వదలలేక అయోమయ స్థితిలో ఉంటున్నారు. అదీ కాకుండా కరోనా వేళలో దినసరి వెచ్చాల ధరలు అమాంతంగా పెరిగిపోవడం కూడా పిడుగుపాటుగా మారింది. గ్యాస్‌ సిలిండర్లు ఖాళీ అయినా నింపుకొనే దారి లేదు. అంతెందుకు కనీసం టీ చేసుకోడానికి పాలు కొనే శక్తి కూడా లేకుండా దైన్యంగా ఉంటున్నారు.

కొన్ని స్వచ్చంద సంస్థలు వండిన ఆహారాన్ని ఢిల్లీ జీబీ రోడ్‌ ప్రాంతంలో సరఫరా చేస్తున్నా.. సెక్స్‌వర్కర్లతోపాటు మిగిలిన వారు కూడా అధికసంఖ్యలో వస్తుండటంతో సెక్స్‌వర్కర్లకు ఈ సాయం అందుబాటులో లేకుండా పోతోంది. ఆహారం తెచ్చిన అరగంటలోనే అయిపోతుండటంతో వీరు రిక్త హస్తాలు శూన్య చూపులతో ఉండిపోవాల్సి వస్తోంది. ఇలాంటి దుస్థితిని అధిగమించేందుకు సుల్తానా బేగమ్‌ కొందరితో కలిసి మార్కెట్‌ల వ్యాపారులు వదిలేసిన కాయగూరల్ని సేకరించి, మంచి నీటితో శుభ్రపరచి, సెక్స్‌వర్కర్లకు పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభించింది.

‘రోజూ తెల్లారు జామున 5 గంటలకల్లా నేను మరి కొందరితో కలిసి కాయగూరలమ్మే వారి వద్దకు వెళతాము. రెండ్రోజుల కిందటివి, సగం కుళ్ళిన కాయగూరల్ని సేకరించుకు వస్తాము. వాటిని గ్రాముల లెక్కల మా సెక్స్‌ వర్కర్లకు సరఫరా చేయాల్సి వస్తోంది. అందరి ప్రాణాలు నిలపుకోవాలంటే ఇదే మాకున్న మార్గం’ అంటూ గద్గద స్వరంతో తెలిపింది సుల్తానా.

రాజస్థాన్‌ అజ్మీర్‌లోని రేష్మా (పేరు మార్చాం) లాక్‌డౌన్‌ వేళలో పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే చూడలేక వారికి నాల్గు మెతుకుల కోసం పనికి వెళ్ళింది. సాటి సెక్స్‌వర్కర్లు ఎందుకు బైటకెళతావు...అసలే కరోనా ఉంది అని హెచ్చరిస్తే తను ‘ కరోనా మాటేంటో గానీ మేం ఆకలితో చచ్చేలా ఉన్నాం’ అని ఉక్రోషంతో బదులిచ్చింది.

మరో సెక్స్‌ వర్కర్‌ నేహా (పేరుమార్చాం) తన వద్ద ఉన్న విలువైన వస్తువులన్నింటినీ అమ్మి మరీ ఉత్తరప్రదేశ్‌లోని తన పుట్టింటిలో అమ్మ వద్ద ఉన్న ఇద్దరు పిల్లల తిండి కోసం డబ్బులు పంపించేది. ‘ ఏబిడ్డల కోసమైతే ఈ వృత్తిలో దిగిందో ఆ తల్లే తన పిల్లల్ని పోషించుకోలేక దూరంగా పంపించేసింది. కరోనా మమ్మల్ని ఇంత కన్నా ఎక్కువగా ఏం బాధిస్తుంది?’ సుల్తానా బేగం ఆవేదనతో తెలిపారు.

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ఆర్థిక పరిస్థతి మెరుగవ్వాలని పలు పథకాలను ప్రారంభించింది. కానీ ఈ సెక్స్‌ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఒక్క పథకం కూడా ప్రకటించకపోవడం దురదృష్టం కాకపోతే మరేంటి??

Next Story