ధోని ఘన వీడ్కోలుకు అర్హుడు
By తోట వంశీ కుమార్ Published on 27 April 2020 11:29 AM ISTటీమ్ఇండియాకు రెండు ప్రపంచకప్‌లతో పాటు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఘన వీడ్కోలు అర్హుడని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఆదివారం హలో యాప్ లైవ్‌లో అక్తర్.. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.
భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండ్కూలర్ గొప్ప ఆటగాడని.. అతను ఎప్పుడూ స్లెడ్జింగ్ పట్ల ఆసక్తి చూపలేదని, బ్యాట్‌తోనే సమాధానమిచ్చేవాడని పాక్ మాజీ పేసర్ పేర్కొన్నాడు. ది వాల్ రాహుల్ ద్రావిడ్ కూడా సచిన్ లాంటి ఉన్నతమైన ఆటగాడేనని చెప్పుకొచ్చాడు. ఇక బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలి పై ప్రశంసల వర్షం కురిపించాడు. చాఫెల్ ఉదంతం తరువాత.. తన రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విధానంతో పాటు కామెంటేటర్ నుంచి బీసీసీఐ అధ్యక్షుడుగా గంగూలి ఎదిగిన తీరు ఎందరికో స్పూర్తి అని ఈ పాక్ మాజీ పేసర్ అన్నాడు.
ఇక.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తన ఫేవరేట్ ఆటగాడని, 'నువ్వు మంచి ప్లేయర్ వి.. నీ బ్యాటింగ్‌లో మంచి టైమింగ్ ఉందని' ఓ సారి రోహిత్ తో అన్నానని చెప్పుకొచ్చాడు. ఇక విరాట్ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని.. అతన్ని రౌండ్ ద వికెట్ బౌన్సర్ వేసి ఔట్ చేస్తానన్నాడు ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్.
కరోనా సంక్షోభ సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం చాలా గొప్పదన్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ జరిగే సూచనలు కనిపించడం లేదని, ఇంకో ఆరు నెలలు క్రికెట్ మ్యాచ్ లు జరిగే అవకాశం లేదని తాను బావిస్తున్నట్లు చెప్పాడు. మళ్లీ క్రికెట్ కు పూర్వ వైభవం తేవాలంటే భారత్, పాక్ ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లను నిర్వహించాలని అభిప్రాయపడ్డాడు. బాల్ ట్యాంపరింగ్ కు ఐసీసీ అనుమతించవచ్చు అని వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో దీనిపై అక్తర్ స్పందించాడు. బంతి పై ఉమ్మిని ప్రస్తుత పరిస్థితుల్లో వాడకూడదని.. ఒకవేళ అలా చేస్తే ఆటగాళ్లు ఇన్‌పెక్షన్ బారీన పడతారన్న విషయాన్ని ఐసీసీ దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లానని చెప్పాడు. ఇక క్రికెట్‌లో వాసెలిన్ ఎప్పటికి అనుమతించరని స్పష్టం చేశాడు. ప్రస్తుత క్రికెట్‌లో బాబర్ అజామ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జో రూట్, విలియమ్ సన్ టాప్-5 బ్యాట్స్‌మెన్లు అని, షేన్ బాండ్ మాత్రం తన ఆల్‌టైమ్ ఫేవరేట్ అని అక్తర్ అన్నాడు.