రూ. 10,000 కోట్లు ఇవ్వమంటున్న ఒవైసీ.. ఎందుకంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Sep 2020 11:11 AM GMT
రూ. 10,000 కోట్లు ఇవ్వమంటున్న ఒవైసీ.. ఎందుకంటే..!

ఎఐఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ అసెంబ్లీలో ఓల్డ్ సిటీ అభివృద్ధి కోసం రూ. 10,000 కోట్ల రూపాయలు ఇవ్వమని కోరుతూ ఉన్నారు. ఓల్డ్ సిటీ ప్రాంతం మిగతా హైదరాబాద్ నగరంతో పోల్చుకుంటే పెద్దగా అభివృద్ధి చెందలేదని.. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే తమకు 10వేల కోట్ల రూపాయల నిధులు కావాలని కోరారు.

హైదరాబాద్ లోని చాలా ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయని.. కానీ ఓల్డ్ సిటీ మాత్రం అభివృద్ధికి నోచుకోలేకపోతోందని అన్నారు. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఓల్డ్ సిటీని కనీసం పట్టించుకోవడం లేదని.. ఓల్డ్ సిటీ వాసుల బాధ వర్ణణాతీతం అని అన్నారు అక్బరుద్దీన్ ఒవైసి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో మొదలైన మెట్రో రైలు నిర్మాణం పనులు ఓల్డ్ సిటీలో ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని అసదుద్దీన్ గుర్తు చేశారు. ఓల్డ్ సిటీలోని చాలా ప్రాంతాల్లో ఇళ్లకు తాగునీటి కుళాయిలు కూడా లేవని చెప్పుకొచ్చారు. కృష్ణ, గోదావరి నీటిని హైదరాబాద్ కు తీసుకుని వచ్చారు కానీ.. ఓల్డ్ సిటీ వాసులకు త్రాగు నీటి సమస్యలు మాత్రం తీర్చడం లేదని అన్నారు.

ఓల్డ్ సిటీలో చాలా చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయని.. వాటిని టూరిజం స్పాట్స్ గా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు అక్బరుద్దీన్. రోడ్ల వెడల్పు కార్యక్రమాలు చాలా ఆలస్యమవుతూ ఉన్నాయని.. వీలైనంత త్వరగా ఆ పనులను పూర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Next Story