మనమ్మాయి ఒక పర్యావరణ పోరాట యోథురాలే!
By అంజి Published on 8 Dec 2019 12:20 PM IST
గ్రేటా తున్ బర్గ్ అనే స్వీడిష్ బాలిక వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా గళమెత్తిన గాథ దీపశ్రీకి ప్రేరణ. పదిహేనేళ్ల ఈ బాలిక కూడా గ్రేటా లాగానే వాతావరణ మార్పులపై వార్ ప్రకటించింది. “పదకొండేళ్ల గ్రేటా వంటి వారు వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తించాను. మున్నెన్నడూ లేనంతగా వాతావరణం మారుతోందని, ఇది అత్యంత ప్రమాదకరమైనదని గమనించాను. అందుకే గ్రేటా దారిలో నేనూ పోరాటం సాగిస్తున్నాను” అంటోంది దీపశ్రీ పీలా.
పదో తరగతి చదివే దీపశ్రీ వాతావరణ మార్పుల సంక్షోభం విషయంలో ప్రజలను చైతన్య పరచేందుకు “స్కూల్ స్ట్రైక్ ఫర్ క్లైమేట్” అనే ఉద్యమాన్ని ప్రారంభించింది. వైజాగ్ లో ప్రతి శుక్రవారం ఆరు గంటల పాటు గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఆఫీసు ముందు ఎండలో నిలబడి దీపశ్రీ ప్లకార్డులను పట్టుకుని నిలుచుంటోంది. స్థానికంగా, జాతీయంగా వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
“వాయు కాలుష్యం వల్ల ఢిల్లీలో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లలేక ఇళ్లలోనే ఉంటున్నారు. ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల్లో పదిహేను నగరాలు మన దేశంలోనే ఉన్నాయి. కర్బన ఉద్గారాల విషయంలో ప్రపంచంలోనే మనమే తొలి స్థానంలో ఉన్నాయి. ఇవన్నీ నన్ను కలచి వేస్తున్నాయి. అందుకే నా వంతు కర్తవ్యంగా, నా బాధ్యతగా ఈ భూ గ్రహం మేలు కోసం నేను ఈ ఉద్యమాన్ని చేపట్టాను” అని చెబుతోంది దీపశ్రీ.
మొదట్లో దీపశ్రీ కూడా వాతావరణ మార్పుల గురించి పట్టించుకోలేదు. కానీ గ్రేటా థున్ బర్గ్ పోరాటం ఆమెలోని పర్యావరణ ప్రేమికురాలిని మేల్కొలిపింది. చిన్న పిల్లలు కూడా పర్యావరణం కోసం రణం చేయవచ్చునని బోధపడింది. దాంతో దీపశ్రీ పర్యావరణ పోరాట దీపశిఖను వెలిగించింది. ఇలా ఆమె తన స్కూల్ స్ట్రైక్ ఉద్యమాన్ని మొదలుపెట్టింది. నిజానికి ఇది అంత సులువేమీ కాదు. పెద్దపెద్ద వారు మాత్రమే చేపట్టే ఇలాంటి ఉద్యమంలో తన లాంటి చిన్న పిల్ల పాల్గొనడమేమిటి అనుకుంది. ఆ తరువాత తానూ ఏదో ఒకటి చేయాలన్న తహతహలో ముందుకు దూకింది. “ఆరేసి గంటలు ఎండలో నిలబడితే శరీరం బలహీనపడుతుంది. కానీ మనస్సు గట్టిపడుతుంది” అంటుంది దీపశ్రీ. జీవీఎంసీ కార్యాలయం ముందు ఎండలో నిలబడి దీపశ్రీ ఢిల్లీలో కాలుష్యం వల్ల విద్యార్థులు ఎలా తమ విద్యా హక్కును కోల్పోతున్నారో వివరిస్తోంది.
ఫ్రైడే ఫర్ ఫ్యూచర్..
అలాగని దీపశ్రీ తన చదువులను నిర్లక్ష్యం చేయడం లేదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతోంది. రేపు నా సంతానం పర్యావరణ కాలుష్యం గురించి అడిగితే నేనుచేతులు కట్టుకుని కూర్చోకుండా కనీసం నేను పోరాటమైనా చేశానని చెప్పుకుంటాను అని చెప్పింది. దీపశ్రీ ఫ్రైడే ఫర్ ఫ్యూచర్ అనే పర్యావరణ ఉద్యమంలో భాగస్వామి. ఈ ఉద్యమంలో బాలబాలికలు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా పాలుపంచుకుంటున్నారు. దీపశ్రీని తల్లి హేమలత ప్రొత్సహిస్తోంది. “నా బిడ్డ తల్లిదండ్రులు లక్షలు చదువుల కోసం పొదుపు చేయడం, ఇన్సూరెన్స్ పేరిట పెద్ద మొత్తాలు పొదుపుచేయడం మాత్రమే సరిపోదని అంటోంది. ఆమె భవిష్యత్తును, పర్యావరణాన్ని కూడా కాపాడాలని కోరుకుంటోంది.” అని ఆమె తన కూతురిని సమర్థించింది.
దీపశ్రీ తాను ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటానని చెబుతోంది. వైజాగ్ మునిసిపల్ కమీషనర్ కూడా ఆమె ప్రయత్నాన్ని అబినందిస్తున్నారు. నేను త్వరలో దీపశ్రీని కలుస్తాను. మేం ఆమెకు పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం అని కమీషనర్ అన్నారు.