ఆన్ లైన్ క్లాసులపై పేరెంట్స్ లో భిన్నాభిప్రాయాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Jun 2020 3:48 PM GMT
ఆన్ లైన్ క్లాసులపై పేరెంట్స్ లో భిన్నాభిప్రాయాలు

ఎల్ కే జీ పిల్లలకు కూడా ఆన్ లైన్ క్లాసులా ?

ఇప్పటి నుంచే ఫోన్లు అలవాటు చేయడం ప్రమాదమా ?

స్కూల్ ఫీజులతో పాటు..గాడ్జెట్స్ తో తడిసి మోపెడవుతున్న బడ్జెట్..

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ తీవ్రస్థాయిలో ఉండటంతో చాలా వరకూ స్కూళ్లు, కాలేజీలు స్వచ్ఛందంగానే ఇప్పుడప్పుడే తెరవబోమని చెప్పేశాయి. కానీ ధనార్జనే ధ్యేయంగా కొనసాగే స్కూళ్లు, కాలేజీలు మాత్రం 2020-21 అకాడమిక్ ఇయర్ ను ప్రారంభించే ప్రయత్నాలు చేస్తుండటంతో..జూలై 31వ తేదీ వరకూ స్కూళ్లు, కళాశాలలు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కేంద్రం హెచ్చరించింది.

నిజానికి అంతా బాగుంటే.. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా జూన్ 12వ తేదీ నుంచి విద్యాసంవత్సరం మొదలు కావాల్సింది. కానీ కరోనా తెచ్చిపెట్టిన కష్టంతో విద్యార్థులకు ఆన్ లైన్ లోనే క్లాసులు చెప్పాల్సిన పరిస్థితి. సుమారు నెలరోజుల నుంచి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయి. క్లాసులు మొదలైన తొలి రోజుల్లో ఆన్ లైన్ క్లాసుల్లో కూడా స్కూల్ యూనిఫారమ్ వేసుకోవాలని కొన్ని విద్యాసంస్థలు ఆంక్షలు పెట్టగా.. దానిపై వ్యతిరేకత రావడంతో దానిపై నిర్ణయాన్ని మార్చుకున్నాయి.

ఆన్ లైన్ లో క్లాసులు చెప్తున్న వివిధ కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల ముక్కులు పిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫీజులు కట్టడమే కాకుండా..ఇంతవరకూ తమ ఇంట్లో స్మార్ట్ ఫోన్లు, లాప్ టాప్ లు లేనివారు పిల్లల ఆన్ లైన్ క్లాసుల కోసమని తప్పనిసరిగా వాటిని కొనాల్సిన పరిస్థితి. దీంతో అటు ఫీజులు కట్టి , ఇటు గ్యాడ్జెట్లు కొనివ్వడం సాటి మధ్య, పేద కుటుంబాల్లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారాయి.

ఏదో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ క్లాసులు ఆన్ లైన్ లో చెప్తున్నారంటే అది తప్పనిసరి అనుకోవచ్చు. కానీ మరీ దారుణంగా ఎల్ కేజీ పిల్లలకు కూడా ఆన్ లైన్ క్లాసులేంటని ప్రశ్నిస్తున్నారు తల్లిదండ్రులు. అదీ నిజమే కదా. ఆన్ లైన్ క్లాసుల పేరుతో పిల్లల్ని స్మార్ట్ ఫోన్లకు అలవాటు చేసి వారి భవిష్యత్ ను పాడు చేసిన వారవుతారు టీచర్లు. ఇప్పటికే పిల్లలు తల్లిదండ్రుల మాట అసలే వినడం లేదు. ఆన్ లైన్ క్లాసుల పుణ్యమా అని ఫోన్లకు అతుక్కుపోతే పిల్లల భవిష్యత్తుకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

Next Story