రూ.26కే కిలో ఉల్లి

By సుభాష్  Published on  24 Oct 2020 2:03 PM GMT
రూ.26కే కిలో ఉల్లి

ప్రస్తుతం ఉల్లి కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది. ఉల్లి ధర అమాంతంగా పెరిగిపోవడంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వంద రూపాయలకు కిలో ఉల్లి పలకడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉల్లి లేనిది వంటింట్లో వంట చేయలేని పరిస్థితి నెలకొనడంతో సామాన్యులకు భారంగా మారింది. ఇక ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

కేంద్ర ప్రభుత్వం ముందస్తు నిల్వల నుంచి ఉల్లిని తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరినట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి లీలా నందన్‌ తెలిపారు. అసోం, ఏపీ బీహార్, చంఢీఘర్‌, హర్యానా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఈ నిల్వల నుంచి 8 వేల టన్నులు తీసుకుంటున్నాయని, ఇతర రాష్ట్రాలు కూడా తీసుకునేందుకు ఎదురు చూస్తున్నామని అన్నారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో నిల్వ చేసిన బఫర్‌ స్టాక్‌ (ముందస్తు నిల్వలు)ను రూ.26-రూ.28 ధరకే కేంద్రం సరఫరా చేస్తోందన్నారు. ఆయా రాష్ట్రాలు నేరుగా సరఫరా కావాలంటే కిలో రూ.30 చొప్పున ఇస్తామన్నారు.

దేశంలో ఉల్లి నిల్వలపై కేంద్రం ఆంక్షలు విధించింది. టోకు వర్తకులు 25 మెట్రిక్‌ టన్నులు, చిల్లర వర్తకులు రెండు మెట్రిక్‌ టన్నులకు మించి నిల్వ చేయడానికి వీల్లేదు. డిసెంబర్‌ 31వ తేదీ వరకు ఆంక్షలు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వ్యాపారులకు వర్తిస్తాయని ఆమె పేర్కొన్నారు.

Next Story