శుభవార్త: చక్రవడ్డీ మాఫీకి కేంద్ర సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

By సుభాష్  Published on  24 Oct 2020 11:43 AM GMT
శుభవార్త: చక్రవడ్డీ మాఫీకి కేంద్ర సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

పండగ సమయంలో రుణ గ్రహీతలకు కేంద్ర సర్కార్‌ ఊరటనిచ్చింది. మారటోరియం కాలానికి రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వెల్లడించింది. వీలైనంత త్వరగా చక్రవడ్డీ అంశంపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంటూ మార్గదర్శకాలను విడుదల చేసింది. వడ్డీ మాఫీ వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.6,500 కోట్ల మేర భారం కానుంది.

కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. గృహ, విద్య, వాహన, ఎంఎస్‌ఎంఈ, వినియోగదాఉల వస్తువుల కొనుగోలు రుణాలు, వినియోగ రుణాలు వంటివి దీని పరిధిలోకి వస్తాయి. ఈ రుణం వర్తించాలంటే ఫిబ్రవరి 29 నాటికి సదరు ఖాతా ఎన్‌పీఎగా గుర్తించి ఉండకూడదని కేంద్రం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి ఉన్న తేడాను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణ గ్రహీతల ఖాతాల్లో జమ చేయాలని కేంద్రం పేర్కొంది. ఈ మొత్తాన్ని రీయింబర్స్‌ చేస్తుందని తెలిపింది. మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు ప్రకటించిన మారటోరియం కాలానికి ఈ స్కీమ్‌ వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.

Next Story
Share it