రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. నిబంధనలు సడలింపు

By సుభాష్  Published on  24 Oct 2020 8:56 AM GMT
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. నిబంధనలు సడలింపు

రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. రైలు ఎక్కేందుకు కనీసం గంటన్నర ముందు స్టేషన్‌కు రావాలని విధించిన నిబంధనను రైల్వే అధికారికంగా సడలించింది. కరోనా నేపధ్యంలో ప్రతి ఒక్కరికి పరీక్షించడంలో భాగంగా స్టేషన్‌లోకి రావడం ఆలస్యమయ్యేది. అందుకే ప్రయాణికులు గంటన్నర ముందు రావాలని రూల్స్‌ విధించింది. ఇప్పుడు ఆ పనిని కంప్యూటకీకరించారు. సికింద్రాబాద్‌, కాచిగూడ, హైదరాబాద్‌ ప్రధాన రైల్వే స్టేషన్‌లలో లేజర్‌ టెక్నాలజీ సహాయంతో థర్మల్‌ స్కీనింగ్‌ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు రైల్వే స్టేషన్‌లోకి అడుగు పెట్టగానే ఆటోమెటిక్‌గా శరీర ఉష్ణోగ్రతను అంచనా వేస్తాయి.

అయితే ప్రయాణికులు ఎప్పటిలాగే అరగంట ముందు రైల్వే స్టేషన్‌కు వచ్చినా సరిపోతుందని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికులను మినహా సహాయకులను ఎవ్వరిని స్టేషన్‌లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. ప్రయాణ సామాగ్రి ఉన్నవారు ముందుగా వచ్చి అక్కడే రైల్వే కూలీలను ఉపయోగించుకోవాలని సూచించారు.

అలాగే ఇంటి నుంచి ఆహారాన్ని తెచ్చుకోవడమే మేలని సూచిస్తున్నారు. రైల్వే స్టేషన్‌లలో క్యాంటీన్లు, రెస్టారెంట్లలో తినేందుకు ఎలాంటి అనుమతి లేదు. అలాగే ప్యాక్‌ చేసి ఉంచిన ఆహారాన్ని మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. మరో వైపు కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో ప్రయాణికులకు అందించాల్సిన బెడ్‌షీట్ల సరఫరా సైతం నిలిపివేసినట్లు వెల్లడించారు. రైలులో ప్రయాణించే వారు మాస్క్‌ , భౌతిక దూరం పాటించాలని సూచించారు.



Next Story