విశాఖ పరవాడ పేలుడు ఘటనలో ఒకరి మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 July 2020 4:40 AM GMT
విశాఖ పరవాడ పేలుడు ఘటనలో ఒకరి మృతి

విశాఖ సాల్వెంట్స్ కంపెనీలో అర్థరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. యాజమాన్యం వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపిస్తున్నాయి. కాగా.. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. శిథిలాల కింద ఒకరి డెడ్ బాడీ కనిపించింది. అనాకపల్లి మండలం రేపాకకు చెందిన శ్రీనివాస్(40) గా భావిస్తున్నారు. కానీ దీనిని అధికారులు కన్ఫమ్ చేయడం లేదు. సాల్వెంట్స్‌ ఫార్మా కంపెనీలో శ్రీనివాస్‌ సీనియర్‌ కెమిస్ట్‌గా‌ పని చేస్తున్నారు. తొలుత కంపెనీలో నలుగురు మాత్రమే పనిచేస్తున్నారని వెల్లడించారు. కానీ ఐదుగురు వ్యక్తులు లోపల ఉన్నట్లు భావిస్తున్నారు. రాత్రి విధులకు వచ్చిన శ్రీనివాసరావు ఆచూకి తెలియడం లేదని.. సమాచారం చెప్పాలని కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని అధికారులు నచ్చచెప్పి వారిని పంపించారు.

ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లేశ్‌ (33) గాజువాకలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో ముగ్గురికి స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు అంటున్నారు. పరిశ్రమ దగ్గర్లోకి ఎవరూ వెళ్లకుండా అన్ని దారుల్నీ పోలీసులు మూసివేశారు. రాంకీ ఫార్మా సంస్థ దగ్గర పోలీసులు భారీగా ఉన్నారు.

ఈ ఘటనపై విశాఖ కలెక్టర్‌ వినయ్‌చంద్‌ స్పందించారు. విశాఖ సాల్వెంట్స్‌ పరిశ్రమలో ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు సత్వర చర్యలను చేపట్టామని కలెక్టర్‌ తెలిపారు. పరిశ్రమ ఆవరణలో అయిదు రియాక్టర్లు ఉన్నాయని, వీటిలో ఒకదాని నుంచి పేలుడు సంభవించినట్లు సమాచారం వచ్చిందన్నారు. యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైందని, సాధ్యమైనంత త్వరగా మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఈ ఘటనపై స్పందించారు. కలెక్టర్ వినయ్‌చంద్‌ను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్న మంత్రి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

Next Story