ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్.. మోపిదేవిలు తమ మంత్రి పదవులతో పాటు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయటం తెలిసిందే. దీంతో మొత్తం నాలుగు పదవులు ఖాళీ అయ్యాయి. దీనికి తోడు గవర్నర్ కోటాలో మరో ఇద్దరు ఎమ్మెల్సీల్ని ఎంపిక చేయాల్సి పరిస్థితి. దీంతో.. మొత్తం ఆరు పదవులు ఖాళీగా మారాయి.

మరి.. ఈ పదవులు ఎవరికి దక్కనున్నాయి? అన్నది ఆసక్తికరంగా మారింది. ఎవరికి వారు ఆ పదవులు తమకు దక్కితే బాగుండన్న భావనలో ఉన్నారు. కొందరు ఆశావాహులు ఇప్పటికే తమ ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే.. ఖాళీగా ఉన్న ఈ పదవుల్ని ఆషాడమాసం పూర్తై.. శ్రావణంలోకి అడుగు పెట్టిన వెంటనే భర్తీ చేస్తారన్న మాట బలంగా వినిపిస్తోంది.

ఈ క్రమంలో ఖాళీగా ఉన్న ఆరుపదవుల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక స్పష్టతకు వచ్చినట్లుగా తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఎంపిక చేసే రెండు ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి ఎస్సీలకు.. మరొకటి మైనార్టీలకు కేటాయించాలన్న తుది నిర్ణయానికి జగన్ వచ్చేసినట్లు చెబుతున్నారు. ఇక.. పిల్లి.. మోపిదేవి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పదవుల్ని బీసీలకుకేటాయించాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని దాదాపుగా తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఎమ్మెల్సీ పదవుల విషయానికి వస్తే.. ఒక స్థానానికి కేవలం తొమ్మిది నెలల గడువే ఉండగా.. మరో ఎమ్మెల్సీకి రెండేళ్ల సమయం ఉంది. అయితే.. ఇప్పుడుభర్తీ చేసే ఇద్దరి పని తీరు బాగుంటే.. వారి పదవుల్ని రెన్యువల్ చేసే వీలుందని చెబుతున్నారు. తొమ్మిది నెలలు పదవీ కాలం ఉన్న దానికి ఎంపిక చేసే నేతకు.. వీలైనంతవరకు రెన్యువల్ గ్యారెంటీ అన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే.. ఈ రెండు స్థానాలు ఎవరికి కేటాయిస్తారన్న దానిపై స్పష్టత రాలేదు.

ఇదిలా ఉంటే.. పిల్లి.. మోపిదేవి రాజీనామాలతో ఖాళీ అయిన మంత్రి పదవుల్లో ఒకదానిని మాత్రం కాపులకు కేటాయించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు మంత్రుల ఎంపిక విషయంలో జగన్ తన వరకు తాను ఒక క్లారిటీకి వచ్చారని.. ఆ విషయాన్ని ఎవరితోనూ చర్చించకుండా గుంభనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆషాడం మరికొద్ది రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో.. ఈ ఆరు పదవులు ఎవరికి దక్కనున్నాయన్న సస్పెన్స్ త్వరలోనే తీరిపోతుందన్న మాట వినిపిస్తోంది.

సుభాష్

.

Next Story