రాజ్ భ‌వ‌న్‌కు క‌రోనా షాక్‌

By సుభాష్  Published on  13 July 2020 8:00 AM GMT
రాజ్ భ‌వ‌న్‌కు క‌రోనా షాక్‌

గతంలో అందరికి పాజిటివ్ అన్న మాట వినిపించినంతనే ముఖం విప్పారేది. కరోనా పుణ్యమా అని.. పాజిటివ్ అన్నది బ్యాడ్ న్యూస్ గా మారింది. పాజిటివ్ అన్న మాట వినిపించినంతనే గుండెలు అదిరిపోయే పరిస్థితి. ఎన్ని చర్యలు తీసుకున్నా.. మరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఒకరిద్దరు చేసే తప్పునకు వందలాది మంది మూల్యం చెల్లించే పరిస్థితి తాజాగా నెలకొంది.

మొన్నటికి మొన్నముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతిభవన్ లో పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలువడింది లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్ భవన్ లో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ లు నమోదైనట్లుగా వార్తలు వచ్చాయి. మొత్తంగా రాజ్ భవన్ లో పని చేసే వారిలో 48 మందికి పాజిటివ్ రావటం కలకలం రేగుతోంది.

రాజ్ భవన్ లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల్లో 28 మందికి.. పది మంది రాజ్ భవన్ సిబ్బందితో పాటు.. వారి కుటుంబ సభ్యుల్లో మరో పదిమందికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో.. గవర్నర్ దంపతులు తాజాగా పరీక్షలు చేయించుకున్నారు. అయితే.. వారికి మాత్రం నెగిటివ్ అన్న రిజల్ట్ అని రావటంతో ఊపిరి పీల్చుకున్నారు. రాజ్ భవన్ లో విధులు నిర్వర్తించే ప్రత్యేక పోలీసు బెటాలియన్ సిబ్బంది దాదాపు నాలుగు వందల మంది వరకు ఉన్నారు.

వీరిలో 347 మందికి పరీక్షలు నిర్వహించగా 28 మందికి పాజిటివ్ గా తేలింది. వెంటనే వారికి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి పంపారు. ఈ ఫలితం వచ్చినంతనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాజ్ భవన్ సిబ్బందికి.. వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మరో ఇరవై మంది (పది మంది రాజ్ భవన్ సిబ్బంది.. మరో పది మంది వారి కుటుంబ సభ్యులు)కి పాజిటివ్ గా తేలింది. రాజ్ భవన్ లో పాజిటివ్ గా నమోదైన కేసుల వివరాల్ని గవర్నర్ తమిళ సై స్వయంగా ట్వీట్ తో వెల్లడించటం గమనార్హం.

దీనికి భిన్నంగా ప్రగతిభవన్ లో నమోదైన పాజిటివ్ ల గురించి ఇప్పటివరకూ అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత.. జాగ్రత్తలు తీసుకునే ప్రగతిభవన్.. రాజ్ భవన్ లాంటి చోట్ల పాజిటివ్ కేసులు ఎలా నమోదవుతున్నాయి? దానికి కారణం ఏమిటి? అన్న కోణాల్లో ఆరా తీస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

రాజ్ భవన్ కావొచ్చు.. ప్రగతిభవన్ కావొచ్చు.. పాజిటివ్ కేసుల నమోదు కు ప్రధాన కారణం.. పెద్ద ఎత్తున సిబ్బంది పని చేయటమే. వారంతా తమ ఉద్యోగ బాధ్యతలు అయిన వెంటనే ఇళ్లకు వెళ్లటం.. వారుండే ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు ఉన్న నేపథ్యంలో.. అనుకోని రీతిలో వైరస్ సంక్రమించే అవకాశం ఉందంటున్నారు. ఈ కారణంతోనే పాజిటివ్ కేసులు కీలకమైన రాజ్ భవన్.. ప్రగతిభవన్ వరకు వస్తున్నాయన్న మాట వినిపిస్తోంది.

Next Story