కనకదుర్గ ప్లై ఓవర్‌ పై నుంచి వాహనాలకు అనుమతి

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 17 Sept 2020 1:44 PM IST

కనకదుర్గ ప్లై ఓవర్‌ పై నుంచి వాహనాలకు అనుమతి

ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దుర్గగుడి ప్లై ఓవర్‌ ప్రారంభోత్సవం మరో సారి వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెలారంభంలోనే ఈ వంతెన జాతికి అంకితం కావాల్సి ఉండగా.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతితో వాయిదా పడింది. రేపు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ చేత కనకదుర్గ ప్లైఓవర్‌ని ప్రారంభింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఆయన కరోనా బారిన పడడంతో.. ఐసోలేషన్‌లోకి వెళ్లిన నేపథ్యంలో మరోమారు వంతెన ప్రారంభోత్సవం వాయిదా పడింది.

అయితే.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం శుక్రవారం నుంచి ఫ్లైఓవర్‌పై నుంచి వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తారు. ఈ విషయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. "గడ్కరీ గారికి కరోనా రావటం వల్ల రేపు జరగబోయే కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా పడింది కాని ప్రజా అవసరాల దృష్ట్యా కనకదుర్గ ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ రేపటి నుండి వదలటం జరుగుతుంది" అని నాని తన ట్వీట్‌ చేశారు.



Next Story