వీడని ఉత్కంఠ.. మళ్లీ వాయిదా..!
By తోట వంశీ కుమార్ Published on 14 April 2020 3:17 PM GMTకరోనా వైరస్ దెబ్బకు క్రీడారంగం కుదేలైంది. ఈ మహమ్మారి దెబ్బకు.. పలు టోర్నీలు రద్దు కాగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. కరోనా ముప్పుతో మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏప్రిల్ 15 వరకు వాయిదా పడింది.
ఇక మనదేశంలో వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది. దీంతో.. నేటితో ముగియనున్న లాక్‌డౌన్ ను ప్రధాని నరేంద్ర మోదీ మే 3 వరకు పొడిగించారు. కాగా.. లాక్‌డౌన్ పొడిగింపుతో ఏప్రిల్ 15 నుంచి ఐపీఎల్ ప్రారంభమయ్యే అవకాశం లేదు. లాక్‌డౌన్ పూర్తి అయ్యే మే 3 వరకు కూడా ఐపీఎల్ నిర్వహించే అవకాశం లేదు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ ను ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై సగటు క్రీడాభిమాని చాతా ఉత్సుకతతో ఎదురు చేస్తున్నాడు.
దీనిపై ఓ బీసీసీఐ అధికారి స్పందిచాడు. ఐపీఎల్ 2020 భవితవ్యంపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. కరోనా వైరస్ సంక్షోభానికి సంబంధించి ప్రభుత్వం మరోసారి కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఐపీఎల్ సమస్యకు పరిష్కారం కోసం భాగస్వాములందరితో బోర్డు చర్చిస్తుంది. మే 3 తర్వాత మాత్రమే పరిస్థితిని బీసీసీఐ సమీక్షిస్తుందన్నారు. ఒక వేళ ఈ ఏడాది ఐపీఎల్ రద్దైతే.. రూ.3వేల కోట్ల దాకా నష్టం వస్తుందని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సోమవారం ఐపీఎల్ పై తుది నిర్ణయం ప్రకటిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలి చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ప్రసంగించనున్నారని.. లాక్‌డౌన్ ను పొడిగిస్తారనే వార్తలు రావడంతో బీసీసీఐ, ప్రాంచైజీల సమావేశాన్ని వాయిదా వేశారు.
ఈ ఏడాది ఐపీఎల్ సెప్టెంబర్ లో నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సమయం సరిపోకపోతే.. మినీ ఐపీఎల్ నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ ఉందట.వాయిదా వేస్తే.. రూ.3వేల కోట్లకు పైగా నష్టం వస్తుండడంతో .. ఎట్టి పరిస్థితుల్లో మిని ఐపీఎల్ అయినా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.