ఓల్డ్ సిటీ మసీదులో యోగా సెంటర్‌..!

By అంజి  Published on  16 Feb 2020 7:47 AM GMT
ఓల్డ్ సిటీ మసీదులో యోగా సెంటర్‌..!

ఇటీవలి కాలంలో మనుషులలో చాలా మార్పులు వస్తున్నాయి. మానసికంగా కూడా ఎన్నో సమస్యలు. చిన్న వయసులోనే ఏవేవో రోగాలు.. స్థూలకాయం విపరీతంగా పెరిగిపోతోంది. యోగా ద్వారా వీటన్నిటికీ పరిష్కారం చూపవచ్చు అని అంటూంటారు. యోగా చేసి మనసును, శరీరాన్ని అదుపు లోకి తీసుకొని వద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉచితంగా యోగా నేర్పిస్తూ ఉంటారు. హైదరాబాద్ లోనూ అలాంటి యోగా సెంటర్లు చాలానే ఉన్నాయి. ఇప్పుడు సరికొత్తగా మసీదులో యోగా క్లాసులు ఇవ్వనున్నారు. హైదరాబాద్ నగరంలో మసీదులో యోగా క్లాస్ లు నిర్వహించడం ఇదే మొదటిసారి. నవాబ్ సాహెబ్ కుంటలో 'మస్జిద్-ఏ-ఇషక్' లోని మూడు ఫ్లోర్లలో ఒక ఫ్లోర్ లో యోగా నిర్వహించనున్నారు.

ఓల్డ్ సిటీలో చాలా ప్రాంతాల్లో నడవడానికి, బయట ఆసనాలు వేయడానికి స్థలం చాలడం లేదు. దీంతో మసీదు కౌన్సిలర్లు మసీదులోని ఒక ఫ్లోర్ లో యోగాసనాలు వేసుకోడానికి అనుమతి ఇచ్చారు. పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోతున్న వారికి.. దాన్ని తగ్గించుకునేందుకు ప్రత్యేకంగా యుట్యూబ్ లింక్స్ కూడా ఇస్తున్నారు యోగా అధ్యాపకులు. చాలా మంది మహిళలు యోగా క్లాసుల్లో పాల్గొనడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.

ముఖ్యంగా బరువు తగ్గడానికి చాలా మంది వస్తున్నారు. గుండెను ఆరోగ్యంగా కూడా ఉంచుకోడానికి యోగా ఉపయోగపడుతుందని.. యోగా కూడా తమ లైఫ్ స్టైల్ లో భాగంగా అలవర్చుకోవాలని వారు భావిస్తున్నారు. ఈ యోగా క్లాసులకు 600 మంది వస్తుండగా.. వారిలో 70శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఓల్డ్ సిటీలో బయట ఆసనాలు చేసుకోడానికి పెద్దగా సదుపాయాలు లేకపోవడంతో యోగా క్లాస్ లపై ఓల్డ్ సిటీ ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ యోగా క్లినిక్ లో ఇద్దరు డైటీషియన్స్.. ఒక లేడీ డాక్టర్ కూడా ఉన్నారు.

Next Story