సహోద్యోగి గట్టిగా కౌగిలించుకున్నాడని కోర్టును ఆశ్రయించిన మహిళ.. లక్షకు పైగా జరిమానా
Woman sues colleague for breaking her ribs while hugging.కంపెనీలో పని చేస్తున్న ఓ మగ ఉద్యోగి తనతో పాటు పని
By తోట వంశీ కుమార్ Published on 18 Aug 2022 9:32 AM ISTకంపెనీలో పని చేస్తున్న ఓ మగ ఉద్యోగి తనతో పాటు పని చేస్తున్న మహిళా ఉద్యోగిని కౌగిలించుకున్నాడు. దీనిపై ఆగ్రహించిన సదరు మహిళ కోర్టు మెట్లు ఎక్కింది. కోర్టు సదరు పురుష ఉద్యోగికి రూ.1.16లక్షల జరిమానా విధించింది. ఈ ఘటన చైనాలోని యుయాంగ్ నగరంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. యుయాంగ్ నగరంలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ మహిళ తన కార్యాలయంలో సహోద్యోగితో చాట్ చేస్తుండగా, ఒక మగ సహోద్యోగి ఆమె వద్దకు వచ్చి ఆమెను చాలా గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలింత నొప్పితో ఆమె కేకలు వేసింది. అతడు విడిచిపెట్టిన తరువాత కూడా ఛాతిలో నొప్పిగా అనిపించింది. సాయంత్రం ఇంటికి వెళ్లిన తరువాత నూనెతో మసాజ్ చేయించుకోగా కాస్త ఉపశమనం లభించింది.
అయినప్పటికి నొప్పి తగ్గలేదు. అయిదు రోజులు గడిచినా ఏ మాత్రం నొప్పి తగ్గకపోవడంతో ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఎక్స్‌రే తీయగా.. ఆమె ఛాతి భాగంలో మూడు పక్కటెముకలు విరిగినట్లు గుర్తించారు. కుడి వైపున రెండు, ఎడమ వైపున ఒకటి విరిగిపోయాయి. వైద్యానికి భారీగా ఖర్చు అయింది. ఆఫీసుకు సెలవు పెట్టాల్సి వచ్చింది. సెలవు పెట్టడడంతో జీతం రాలేదు. కాస్త కోలుకున్న అనంతరం తన పరిస్థితిని కౌగిలించుకున్న ఉద్యోగి దృష్టికి తీసుకువెళ్లింది.
ఖర్చులు భరించమని చెప్పింది. అయితే.. ఇందుకు అతడు నిరాకరించాడు. తాను కౌగిలించుకోవడం వల్లనే ఎముకలు ఎలా విరుగుతాయని ప్రశ్నించాడు.? దీంతో సదరు మహిళ కోర్టు మెట్లు ఎక్కింది. తనకు ఆర్థిక పరిహారం ఇప్పించాలని కోరింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. ఘటన జరిగిన అనంతరం సదరు మహిళ ఆ ఐదు రోజుల్లో ఎముకలు విరగడానికి కారణమయ్యే ఏ పనులు చేసినట్లు రుజువు లేదని తెలిపింది. ఆమెకు 10వేల యువాన్లు(సుమారు 1.6లక్షలు) చెల్లించాలని కౌగిలించుకున్న ఉద్యోగిని ఆదేశించింది.