ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
Woman gives birth to 4 babies at VIMSAR.ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది.
By తోట వంశీ కుమార్ Published on 22 Sept 2022 8:54 AM ISTమహిళలు కవల పిల్లలకు జన్మనివ్వడం సాధారణ విషయమే. కొందరు మహిళలు ఒకేసారి ముగ్గురు పిల్లలకు జన్మనిస్తుంటారు. అయితే ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వీరిలో ముగ్గురు ఆడ పిల్లలు కాగా, ఒకరు మగ పిల్లాడు. ఈ అరుదైన ఘటన ఒడిశా రాష్ట్రంలోని సంభాల్‌పూర్‌లో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. సోనేపూర్ జిల్లా బంజిపాలి గ్రామానికి చెందిన కుని సునా అనే మహిళకు నెలలు నిండటంతో సోమవారం సంభాల్‌పూర్‌లోని వీర్ సురేందర్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ ప్రభుత్వ ఆస్ప్రత్రిలోని ప్రసూతి అండ్ గైనకాలజీ విభాగంలో చేర్చారు. పురిటి నొప్పులు రావడంతో వైద్యులు ఆమెకు సాధారణ కాన్పు చేశారు. ఈ క్రమంలో ఆమె నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది.
మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కుని ఇద్దరు ఆడపిల్లలు, 2.02 గంటలకు మరో ఆడపిల్ల, 2.04 గంటలకు మగబిడ్డ కు కుని జన్మినిచ్చినట్లు వైద్యులు తెలిపారు. తల్లితో పాటు నలుగురు పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారని, కాస్త తక్కువ బరువు ఉన్నట్లు వెల్లడించారు. దీంతో చిన్నారులను ప్రత్యేక నవజాత సంరక్షణ యూనిట్‌కు తరలించినట్లు చెప్పారు.
ఇలా ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించడం చాలా అరుదని, 5 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలా నలుగురు పిల్లలు పుట్టే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. తమ దవాఖానలో ఇలా జరగడం ఇదే తొలిసారన్నారు.